ఏపీకి ఎయిర్ బ‌స్‌..ఇదేం జ‌ర్న‌లిజంరా బాబు?

Update: 2018-01-25 04:28 GMT
పొద్దు పొద్దున్నే పేప‌ర్ తీస్తే చాలు.. బాబును ఆకాశానికి ఎత్తేసే కార్య‌క్ర‌మాన్నిఎంత కొంగొత్త‌గా చేస్తున్న వైనం చూసి ఆశ్చ‌ర్యంతో ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. అక్ష‌రాల్ని జ‌నం మీద‌కు వ‌దిలే విష‌యంలో కొన్ని మీడియా సంస్థ‌ల తీరే వేరుగా ఉంటుంది.  మ‌రి ముఖ్యంగా బాబును ఆకాశానికి ఎత్తేసే విష‌యంలో స‌ద‌రు మీడియా సంస్థ‌ల ప్ర‌త్యేక ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటాయి. ఈ రోజు విష‌యాన్నే చూద్దాం. దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ప‌లువురు ప్ర‌ముఖుల్ని క‌లిశారు. కొంద‌రితో భేటీ అయ్యారు.

ఇలాంటి వారి జాబితాలో ఎయిర్ బ‌స్ సంస్థ సీఈవో డిర్క్ హోక్ ను క‌లిశారు. ఆయ‌న‌తో భేటీ అయ్యారు. అంతే.. కొంగొత్త వార్త వంట‌కం ప్ర‌క్రియ మొద‌లైంది. అదెలానంటే.. ఇండియాకు ఎయిర్ బ‌స్ సంస్థ రానుంది. టాటాతో క‌లిసి ఎయిర్ బ‌స్ సంస్థ భార‌త్ లో విమానాల ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేసే ఆలోచ‌న‌లో ఉంది.

ఇలాంటి వేళ ఎయిర్ బ‌స్ సీఈవోతో బాబు స‌మావేశ‌మైన విష‌యాన్ని.. ఏపీకి ఎయిర్ బ‌స్ పేరుతో ప‌క్క‌న ఒక క్వ‌శ్చ‌న్ మార్క్ పెట్టేసి భారీ క‌థ‌నాన్ని అచ్చేశారు. ఏపీకి ఎయిర్ బ‌స్సా?.. అంటూ వ‌చ్చిన వార్త‌ను చూసినంత‌నే.. ఏపీకి బాబు పుణ్య‌మా అని భారీ మేలు జ‌రుగుతుంద‌న్న భావ‌న క‌లిగేలా వార్త ఉండ‌టం గ‌మ‌నార్హం.

స‌రే.. ఇంత పెద్ద విష‌యాన్ని బాబు ఎలా సాధించార‌న్న ఆస‌క్తితో వార్త‌లోకి వెళితే.. ఎయిర్ బ‌స్ సీఈవోతో బాబు భేటీ అయ్యారు. అంద‌రిని అడిగిన‌ట్లే.. మీరు భార‌త్ లో ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నారు క‌దా?.. మీరు కానీ ఏపీకి వ‌చ్చి ప‌రిశ్ర‌మ పెడితే.. అనుమ‌తుల‌న్నీ వెంట వెంట‌నే ఇచ్చేస్తామ‌ని చెప్ప‌టంతో పాటు.. మీ కంపెనీకి పూర్తిస్థాయిలో స‌హ‌క‌రిస్తామంటూ చెప్పేశారు.

బాబు మాట‌ల్ని విన్న ఎయిర్ బ‌స్ సీఈవో త‌ల పంకించారే త‌ప్పించి.. ఆయ‌న నోటి నుంచి ఎలాంటి సానుకూల వ్యాఖ్య వ‌చ్చింది లేదు. ఆ మాట‌కు వ‌స్తే.. ఎయిర్ బ‌స్ సీఈవో మొద‌లు..  ప‌లువురు వ్యాపార వేత్త‌లతోనూ.. సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తోనూ బాబు భేటీ అయ్యారు. అయితే.. ఇవాల్టికి బాబును ఎత్తే ప్రోగ్రామ్ ఎయిర్ బ‌స్ తో ముడేసి త‌యారు చేశార‌ని చెప్పాలి. ఏమైనా.. బాబును పైకి ఎత్త‌టంలో కొన్ని మీడియా సంస్థ‌ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అంతా ఇంతా కాద‌న్న విష‌యం తాజా ఉదంతం మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News