బాబుకు ఖాళీచేయి చూపించిన రాజ్‌ నాధ్!

Update: 2017-07-26 04:23 GMT
‘‘ముందు మీరు వెళ్లి అంతా సిద్ధం చేయండి.. ఫైనల్ గా నేను వచ్చి విన్నింగ్ షాట్ కొట్టి ఓ ఫినిషింగ్ టచ్ ఇస్తాను’’  అన్న రేంజిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన తెలుగుదేశం ఎంపీలను సిద్ధం చేశారు. ఆ మేరకు వారికి పార్లమెంటు సమావేశాలకు ముందునుంచే కోచింగ్ ఇచ్చి పంపించారు. ఎటూ రాష్ట్రపతి ప్రమాణ స్వీకార ఉత్సవానికి చంద్రబాబు వస్తున్నాడు గనుక.. ఆలోగా తాము కాస్త ప్రిపేర్ చేసి పెట్టాలని.. ఎంపీలు కేంద్రమంత్రుల్ని కలిసి తమ డిమాండ్లన్నింటినీ వారి ముందుంచారు. ఫైనల్ టచ్ లాగా మంగళవారం నాడు చంద్రబాబునాయుడు ఎంట్రీ ఇచ్చి... వరుసబెట్టి కొందరు మంత్రుల్ని కలిశారు. ఫైనల్ గా సాధించింది మాత్రం స్వల్పంగానే కనిపిస్తోంది. ‘బిల్లు కూడా సిద్ధమైంది.. త్వరలోనే పార్లమెంటు ముందుకు వస్తుంది’ అనే స్థాయిలో స్పష్టమైన హామీ.. ఒక్క ప్రకాశ్ జవదేకర్ నుంచి మాత్రమే.. గిరిజన - సెంట్రల్ యూనివర్సిటీ ల విషయంలో మాత్రం దక్కింది. చంద్రబాబునాయుడు అతి ఎక్కువ ఫోకస్ పెట్టిన  - అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారంలో అయితే.. హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ తన చేతుల్లో ఏమీ లేదన్నట్లుగా రిక్తహస్తం చూపించినట్లు వార్తలు వస్తున్నాయి.

రాష్ట్రంలోని తెలుగుదేశం నాయకులకు కేంద్రం నుంచి సాధించవలసిన వాటిలో  అసెంబ్లీ సీట్ల పెంపు అనే వ్యవహారం తప్ప.. మరేదీ అంత ప్రాధాన్యమైనదిగా కనిపిస్తున్నట్లు లేదు. ఎందుకంటే ఈ సీట్ల పేరిట మాయ చేసి రకరకాల ప్రలోభాలకు వారు ఆల్రెడీ పాల్పడ్డారు. పెరగకపోతే.. దెబ్బ పడే పరిస్థితి. అందుకే ఆరాటపడుతున్నారు. అయితే ఈ కోరికను హోం మంత్రి ముందు పెట్టినప్పుడు.. ఇక కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే జరగాల్సి ఉన్నదని.. అమిత్ షా - మోదీలతో మీరే మాట్లాడుకోవాలని ఆయన చంద్రబాబుకు సలహా ఇచ్చి పంపినట్లు సమాచారం. అంటే.. ఇది ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదన్నమాట.

అరుణ్ జైట్లీ వద్ద పోలవరం నిధుల విషయంలోనూ చంద్రబాబు కు ఇదే తీరుగా స్పష్టమైన హామీ దక్కనేలేదు. వీలైనంత త్వరగా నిధులు విడుదల చేస్తే చాలనే కోరికను మాత్రం వారి ముందు పెట్టి ఆయన వెను దిరిగినట్లు తెలుస్తోంది.

అసలే ఒకవైపు రాజకీయంగా తెలుగుదేశం - భాజపాల మధ్య ఎడం పెరుగుతున్నదనే చర్చ ఒకటి ప్రారంభం అయింది. ఏపీలో తెలుగుదేశం ప్రాభవంపై వారికి అనుమానం కలిగిందో.. లేదా, తామే స్వతంత్ర శక్తిగా ఎదగాలనే కోరిక వారిలో బలపడుతున్నదో తెలియదు గానీ.. భాజపా తెలుగుదేశం పట్ల ఇదివరకటి కంటె భిన్నంగా వ్యవహరిస్తున్న మాట నిజం. తాజా పర్యటన దాఖలాలు కూడా దీనికి నిదర్శనంగానే నిలిచేలా ఉన్నాయి.
Tags:    

Similar News