చంద్రబాబు పిలుపు తేడా కొట్టదు కదా..

Update: 2016-08-06 11:07 GMT
చంద్రబాబు తాజాగా ఇచ్చిన పిలుపు ఎక్కడకు దారితీస్తుందో అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వివిధ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ ముందుకెళ్తున్న ఆయన ఇప్పుడు ఏకంగా అవినీతిని రూపుమాపడానికి ప్రజల చేతికి చట్టం అప్పగించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాధికారులు ఎవరైనా డబ్బులు అడిగితే తిరగబడండి అని పిలుపునిచ్చిన ఆయన... మీ వెనుక నేనుంటా అని భరోసా కూడా ఇచ్చారు. అయితే... ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తాజా పరిస్థితులను చూస్తున్నవారు మాత్రం చంద్రబాబు పిలుపునకు ప్రజలు స్పందించి తిరగబడడం మొదలైతే ఏపీ ఫిలిప్పైన్సులా మారిపోతుందని అంటున్నారు. ఫిలిప్పైన్సులో కూడా అక్కడి అధ్యక్షుడు ఇలాంటి పిలుపునే ఇవ్వగా ఇప్పుడదని తీవ్ర శాంతిభద్రతల సమస్యగా మారిపోయింది.

ఫిలిప్పైన్సులో మాదక ద్రవ్యాలను అరికట్టడం కోసం అవి తయారుచేసేవారు - విక్రయించేవారు - వాడేవారు - రవాణా చేసేవారు.. ఇలా అందరిపైనా దాడులు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చాడు ఫిలిప్పైన్సు అధ్యక్షుడు. దీంతో జనం రెచ్చిపోయారు. గత రెండు నెలల్లో సుమారు 1000 మందిని చంపేశారు. అందులో నిజంగానే మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్నవారు ఉన్నప్పటికీ కొందరు మాత్రం దాంతో సంబంధం లేనివారినీ చంపేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. కాళ్లూ చేతులూ నరికేస్తున్నారు. దీంతో ఫిలిప్ఫైన్సు వీధుల్లో రక్తం ప్రవహరిస్తోంది... తెగిపడిన కాళ్లుచేతులు కనిపిస్తున్నాయి.. ఎక్కడ చూసినా మృతదేహాలే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అవకాశం ప్రజలకు కల్పించడం వల్ల కలిగిన దుష్పరిణామం అది. ఇప్పుడు చంద్రబాబు పిలుపు కూడా ఇలా తేడా కొడితే కష్టమేనంటున్నారు కొందరు.

అనంతపురంలోని ధ‌ర్మ‌వ‌రంలో రైల్వే బిడ్జిని ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన చంద్రబాబు ఇలా ప్రభుత్వ అధికారుల అవినీతిపై వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా లంచమడిగితే తిరగబడాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఉద్యమం చేపట్టాలన్నారు.  అంతా బాగానే ఉన్నా లంచాలు తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులను నియంత్రించలేక ప్రజలను వారిపైకి ఉసిగొల్పడంపైనే విమర్శలొస్తున్నాయి.
Tags:    

Similar News