ఐవైఆర్‌ పై వేటేసిన చంద్ర‌బాబు?

Update: 2017-06-20 06:39 GMT
న‌మ్మి ప‌ద‌వి ఇస్తే ఎలా ఉండాలి? క‌ట్ట‌ప్ప‌లా విశ్వాసంగా ప‌డి ఉండాలే కానీ.. ఏది మంచి? ఏది చెడు? అన్న విష‌యాన్ని చెబితే ఏరాజ‌కీయ అధినేత‌కు మాత్రం కాల‌కుండా ఉంటుంది. అందులోకి సోష‌ల్ మీడియాలో త‌ర‌చూ ర‌చ్చ జ‌ర‌గ‌ట‌మే కాదు.. మీడియాల‌లోనూ ప్ర‌ముఖంగా వ‌చ్చిన త‌ర్వాత స్పందించకుండా ఉంటారా? త‌న మీదా.. త‌న ప్ర‌భుత్వం మీద తాను న‌మ్మి ప‌ద‌వి ఇచ్చిన పెద్ద‌మనిషి చేస్తున్న విమ‌ర్శ‌ల్ని చంద్ర‌బాబు స‌హించ‌లేక‌పోయారు. అందుకే ఏపీ రాష్ట్ర బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ కు ఛైర్మ‌న్‌ గా కేబినెట్ ర్యాంకుతో అంద‌లం ఎక్కించిన ఐవైఆర్ కృష్ణారావు మీద వేటు వేస్తూ చంద్ర‌బాబు తాజాగా నిర్ణ‌యం తీసుకున్నారు.

విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కృష్ణారావు ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న రిటైర్ అయ్యాక.. ఖాళీగా ఉంచ‌టం ఎందుకున్న ఉద్దేశంతో ఆయ‌న్ను ఏపీ రాష్ట్ర బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌ కు ఛైర్మ‌న్ గా నియ‌మించారు. ఇదిలా ఉంటే.. ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల మీద కృష్ణారావు స్వేచ్ఛ‌గా త‌న అభిప్రాయాల్ని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించ‌టం క‌ల‌క‌లం రేపింది.

ఒక మ‌హిళా ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసి.. ఇంటూరి ర‌వికిర‌ణ్ అనే వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేసిన వైనంపై కృష్ణారావు స్పందిస్తూ.. ఏదైనా విమ‌ర్శ‌లు చేస్తే స‌ర‌దాగా తీసుకోవాలే కానీ కేసులు పెట్ట‌టం నియంతృత్వ వైఖ‌రికి దారి తీస్తుందంటూ త‌న అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేశారు. దీనిపై అధికార పార్టీకి చెందిన నేత‌లు ప‌లువురు ప్ర‌శ్నిస్తే.. తానింతేన‌న్న మాట చెప్పిన‌ట్లుగా చెబుతారు.

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాకు వినోద‌ప‌న్ను మిన‌హాయింపు.. బాహుబ‌లి 2 సినిమాకు అద‌న‌పు షోల‌కు అనుమ‌తులు ఇవ్వ‌టాన్ని ఐవైఆర్ త‌ప్పు ప‌ట్టారు. టీటీడీకి ఈవోగా అనిల్ సింఘాల్‌ ను నియ‌మించ‌టాన్ని ఐవైఆర్ స‌రికాద‌ని తేల్చారు. ఇలా అధికార‌పార్టీ తీసుకున్న నిర్ణ‌యాల్లోని త‌ప్పుల్ని ఓపెన్ గా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్న వైనం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న నిర్ణ‌యానికి బాబు రావ‌టం.. ఆయ‌న‌కు ఇచ్చిన ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. అధికారికంగా వెల్ల‌డి కాని ఈ వ్య‌వ‌హారం.. త్వ‌ర‌లో బ‌య‌ట‌కు రానుంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News