బాబు.. ప్లెజర్ ట్రిప్ లోనూ మనశ్శాంతి కరవు!

Update: 2017-12-20 03:30 GMT
ప్రభువును మించిన ప్రభుభక్తి ప్రదర్శించే వారికి రాజకీయాల్లో కొదవ ఉండదు. తెలుగుదేశంపార్టీ విషయానికి వస్తే.. ఏపీలో ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ అలాంటి ప్రభుభక్తి పరాయణుల్లో ఒకరు. చంద్రబాబు మీద ఈగ వాలనివ్వకుండా చూసుకోవడంలో తాను అందరికంటె ముందుంటానని ఆయనకు ఒక నమ్మకం. ఎంతటివారినైనా ప్రతివిమర్శలతో చెండాడగలనని ఆయన అనుకుంటూ ఉంటారు. కానీ.. పాపం.. భాజపా వారి అత్యుత్సాహానికి ఎదురు మాట్లాడి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చినందుకు అంతటి ప్రభుభక్తి పరాయణుడైన బాబూ రాజేంద్రప్రసాద్.. అధినేత వద్ద చీవాట్లు తినాల్సి వచ్చింది.

ఇంతకూ విషయం ఏంటంటే.. కుటుంబంతో కలసి చంద్రబాబునాయుడు ప్లెజర్ ట్రిప్ గా విహారయాత్రకు మాల్దీవులకు వెళ్లారు. ఏటా తన కుటుంబసభ్యులతో కలసి కొన్నిరోజుల పాటూ ఎక్కడో  ఒకచోటకు వెళ్లడం చంద్రబాబుకు అలవాటే. అయితే ఈసారి కూడా అలాగే కుటుంబంతో కలిసి ప్లెజర్ కోసం ట్రిప్ వెళ్లారు గానీ.. వెళ్లిన దగ్గరినుంచి ఆయనకు మనశ్శాంతి మాత్రం కరవైనట్టు కనిపిస్తోంది.

ఎన్నడో ప్లాన్ చేసుకుని చంద్రబాబు కుటుంబం విహార యాత్రకు వెళ్లింది గానీ.. హైదరాబాదులో జరుగుతున్న తెలుగుమహాసభలకు తనను ఆహ్వానించలేదనే అవమాన భారం ఆయనను మెలిపెట్టేసిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఒకదానికి అధినేతగా ఉంటూ... తెలుగు సభల్లో తన ఘనత చెప్పుకునే అవకాశం లేకుండాపోయిందనేది ఆయనకు మరో బాధ. ఇలాంటి సమయంలో  ఆయనకు కంటగింపు కలిగించేలా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇవి ఆయనకు రుచించేవి కాదని పుకార్లు వచ్చాయి. దానికి తోడు.. ఏపీలో బీజేపీ నాయకులు కొందరు కయ్యానికి కాలు దువ్వే ధోరణి ప్రదర్శించడం.. దానికి తగ్గట్లుగా తెదేపా నాయకులు కూడా బస్తీ మే సవాల్ అన్నట్లుగా తొడకొట్టి బరిలోకి దిగడం.. ఇవన్నీ ఆయనకు మరిన్ని తలనొప్పులు కలిగించినట్లుగా కనిపిస్తోంది.

అసలే కేంద్రంలో మరింతగా బలపడిన పార్టీతో కయ్యం పెట్టుకోగల ధైర్యం చంద్రబాబునాయుడుకు ఉండకపోవచ్చునని, అందుకే భాజపాకు కౌంటర్ ఇచ్చిన సొంత పార్టీ నేతలకు ఆయన అక్షింతలు వేశారని, భాజపా నాయకులను విమర్శించవద్దని సూచించారని, సంయమనం పాటించాలని చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ విదేశాల్లో విహార యాత్రలో ఉన్న చంద్రబాబునాయుడుకు.. పాపం.. ఫ్యామిలీతో గడుపుతున్న ఈ ప్రైవేటు సమయంలోనూ మనశ్శాంతి కరవయ్యేలా రాజకీయ అంశాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని పలువురు జాలిపడుతున్నారు.
Tags:    

Similar News