రేవంత్‌ ను స‌స్పెండ్‌ ను లైట్ తీసుకున్న బాబు

Update: 2017-03-18 04:55 GMT
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును ఓటుకునోటు వ్య‌వ‌హారం వీడ‌టం లేదు. ఈ ఎపిసోడ్‌ లో భాగ‌స్వామ్యం పంచుకున్న వారు తెర‌మీద‌కు వ‌స్తే ఆ వెంట‌నే బాబు పేరు సైతం స‌ద‌రు చ‌ర్చ‌లోకి వ‌స్తుండ‌టం ఆసక్తిక‌రం. తాజాగా ఓటుకు నోటు కేసులో బాబు భాగ‌స్వామ్యంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా గవర్నర్‌ ప్రసంగానికి అడ్డుతగిలారనే కారణంతో టీడీపీ ఎమ్మెల్యేలైన‌ రేవంత్‌ రెడ్డి - సండ్ర వెంకట వీరయ్యను స్పీకర్‌ మధుసూదనా చారి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకు వారికి సస్పెన్షన్‌ను వర్తింపజేశారు.  మ‌రో ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య మాత్రం సమావేశాల్లో పాల్గొంటున్నారు. అయితే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి దాదాపు వారం రోజులు కావస్తున్నా చంద్ర‌బాబు నోరు మెదపకపోవడం చర్చనీయాంశమైంది.

ఈ స‌స్పెన్ష‌న్‌ ను నిర‌సిస్తూ రేవంత్‌ రెడ్డి టీడీఎల్పీ నేతగా హైకోర్టులో రిట్ పిటిషన్‌ దాఖలు చేశారు. తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందించి సస్పెన్షన్‌ ను ఎత్తేయించాలని కోరారు. ఈ చర్యపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వ నియంతృత్వ చర్యలను ఖండించాయి. స్పీకర్‌ అధికారాలకు లోబడి పనిచేయలేద‌నే విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కడానికే స్పీకర్‌ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభావం స్పీకర్‌ పై ఉందనే విమర్శలు వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ చంద్రబాబు మాత్రం ఇంతవరకు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ పై స్పందించకపోవడం గమనార్హం. సంద‌ర్భం ఏదైనా టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వంపై పోరాడాలని, నేను తెలంగాణకు దూరం కాలేదని చంద్రబాబు తెలంగాణ నేతలకు దిశానిర్ధేశం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఉద్యమాలు చేయాలని, క్యాడర్‌ ను కాపాడాలని సూచిస్తుంటారు. ఇంత చెప్పిన అధినాయకుడు రేవంత్‌ రెడ్డి - సండ్ర సస్పెన్షన్‌ విషయంలో ఇంతవరకు మాట్లాడకపోవడం పట్ల ఒకింత అసహనం - ఆందోళన సైతం టీడీపీలో వ్యక్తమవుతోంది. బాబు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డానికి ప్రధాన కారణం ఓటుకు నోటు కేసు అనే చ‌ర్చ కూడా సాగుతోంది.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబుతోపాటు రేవంత్‌రెడ్డి, ఇతరులపై తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వైసీపీ ఎమ్మెల్యే రామ‌కృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబుపై విచారణ జరపాలని సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై కోర్టు స్పందించి విచారణకు స్వీకరించింది. త్వరితగతిన విచారణ చేపట్టేందుకు కూడా అంగీకరించింది. ఈ క్ర‌మంలో ఇర‌కాటంలో ప‌డ‌డం ఎందుకు అనే రీతిలో బాబు సైలెంట్ అయిపోయార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News