ఆ 200 కోట్లు ఎవరి ఖాతా బాబుగారూ?

Update: 2018-02-01 04:11 GMT
మూలిగే నక్కపై తాటిపండు పడుతోంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాపై 200 కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నది. ఈ అదనపు భారం 1500 కోట్లకంటె ఎక్కువగానే ఉండగలదని ముందుగా ఊదరగొట్టి... ఆ తర్వాత తామేదో రాష్ట్రానికి ఫేవర్ చేసేసినట్లుగా బిల్డప్ ఇచ్చి.. అదనపు భారాన్ని 200 కోట్లకు పరిమితం చేస్తున్నట్లుగా .. అదంతా తమ ఘనత అయినట్లుగా ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పందేరం చేసేస్తున్నది. అదంతా ఓకే.. మరి ఈ 200 కోట్ల భారం రాష్ట్ర ఖజానాపై పడుతుందా? కేంద్రం భరిస్తుందా? అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే- ఈ విషయంలో కేంద్రంనుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు మరి!

అవును.. ఇదంతా పోలవరం ప్రాజెక్టు గురించిన వ్యవహారమే! ఈ ప్రాజెక్టు పనుల్లో రెండు కీలకమైన పనుల నిర్వహణను కొత్త కాంట్రాక్టరు నవయుగకు అప్పగించడానికి ఒప్పందాలు దాదాపుగా పూర్తయినట్టే. అయితే ఈ కొత్త కేటాయింపుల్లో చిన్న మెలిక ఉంది.

పాత కాంట్రాక్టరుకు ఇచ్చిన పనుల ఒప్పందం ప్రకారం.. నిర్వహణలో చేయవలసిన పని మోతాదు (భారం) పెరిగినా తగ్గినా.. ఒప్పంద మొత్తాన్ని మాత్రమే ఇస్తారు. డిజైన్ల మార్పు వలన పని భారం పెరుగుతుండగా... పనులు చేయలేక ట్రాన్స్ ట్రాయ్ చేతులెత్తేసే పరిస్థితి. అయితే పాత ఒప్పంద ధరలకే చేయడానికి ముందుకు వచ్చారంటూ నవయుగ సంస్థకు పనులు అప్పజెబుతున్న ప్రభుత్వం.. ఒప్పంద నిబంధనల్ని మాత్రం మార్చేసి కొత్త కాంట్రాక్టర్లకు అదనపు లబ్ధి చేకూరుస్తోంది. పని మోతాదు పెరిగితే.. ఎక్కువ చెల్లిస్తాం.. కాకపోతే పాత ఒప్పంద ధరల ప్రకారం.. అనేది ఈ నిబంధన. దానివల్ల 200 కోట్ల భారం పెరిగే ఛాన్సుంది.

అయితే కొత్త కాంట్రాక్టర్లకు పని ఇచ్చేట్లయితే.. పెరిగే అదనపు భారాన్ని కేంద్రం పైసా కూడా భరించదు అంటూ.. నితిన్ గడ్కరీ గతంలోనే తేల్చిచెప్పారు. ఆ నేపథ్యంలోనే కొత్త టెండర్ల వ్యవహారం చాలాకాలం పెండింగ్ లో పడింది కూడా. అయితే పాత ధరలకే పనుల కేటాయింపు అనే మాట చెబుతూనే.. మడతపేచీ పెట్టి 200 కోట్ల భారం మోపుతున్నారు. ఈ భారాన్ని కేంద్రం భరిస్తుందా... లేదా రాష్ట్ర ఖజానా మీద మోపుతారా అనేది క్లారిటీ రావడం లేదు. అసలే అవినీతి పంపకాల ఆరోపణలు పుష్కలంగా ఉన్న కాంట్రాక్టుల యవ్వారంలో అదనపు భారం గురించి ప్రజల్లో అనేక సందేహాలు కూడా రేగుతున్నాయి.

Tags:    

Similar News