అలిపిరి అటాక్‌ పై బాబు మార్కు స్టేట్ మెంట్‌!

Update: 2018-06-27 09:26 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుపై తిరుప‌తి కేంద్రంగా అలిపిరి వ‌ద్ద జ‌రిగిన న‌క్స‌ల్స్ దాడి చ‌రిత్ర‌లో చెరిగిపోని అధ్యాయ‌మే. తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం కోసం సీఎం హోదాలో వెళుతున్న చంద్ర‌బాబు కాన్వాయ్ పై అలిపిరి దాటికి కొద్ది దూరంలోనూ న‌క్స‌లైట్లు క్లెమోర్ మైన్‌ తో విరుచుకుప‌డ్డారు. న‌క్స‌లైట్ల గురి కూడా క‌రెక్టుగానే త‌గిలింది. అయితే అదృష్ట‌వ‌శాత్తు చంద్ర‌బాబు చిన్న‌పాటి గాయాల‌తోనే బ‌య‌ట‌ప‌డ్డారు. చంద్ర‌బాబు కూర్చున్న కారు న‌క్స‌ల్స్ క్లెమోర్ మైన్ పేలుడు  ధాటికి గాల్లోకి గింగిరాలు తిరిగి కింద‌ప‌డ్డా చంద్ర‌బాబు ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నారు. అయితే ఓ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని టార్గెట్ చేసిన న‌క్స‌లైట్లు... రాజ‌కీయ నేత‌ల వెన్నులో వ‌ణుకు పుట్టించారు. ఏకంగా ఎన్నిక‌ల‌కు ఇంకా ఆరు నెల‌ల స‌మ‌యం ఉన్నా కూడా చంద్ర‌బాబు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో న‌క్స‌లైట్ల బాంబు దాడికి సంబంధించిన సింప‌థీ బాబుకు రివ‌ర్సైపోయింది. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ చేతిలో చిత్తుగా ఓడిపోయిన చంద్ర‌బాబు... విప‌క్షంలో కూర్చోక త‌ప్పలేదు.

అయినా న‌క్స‌ల్స్ కు టార్గెట్ గా తేలారంటే... స‌ద‌రు టార్గెట్‌ గా ఉన్న వ్య‌క్తులు ఏదో సంఘ విద్రోహ కార్య‌క‌లాపాల‌కు పాల్పడుతున్న‌ట్లుగానే నాడు క‌థ‌నాలు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. స‌మాజంలోని అణ‌గారిన వ‌ర్గాల‌కు చెందిన వారిని హింసించ‌డో - ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డి పేద‌ల పొట్ట గొట్ట‌డ‌మో, లేదంటే ఇలాంటి నేరాల‌కు పాల్ప‌డే వారిని కాపాడుకుంటూ వ‌స్తున్న రాజ‌కీయ నేత‌లు కూడా న‌క్స‌ల్స్ టార్గెట్‌ గా మారేవార‌న్న‌ది నాటి మాట‌. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబును కూడా న‌క్స‌ల్స్ టార్గెట్ చేశారు. మొత్తంగా ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న సాగిస్తున్న కార‌ణంగానే చంద్ర‌బాబు న‌క్సల్స్‌కు టార్గెట్‌గా మారిపోయార‌న్న‌ది నాడి మీడియా క‌థ‌నాల సారాంశం. అయితే త‌న‌పై న‌క్సల్స్ ఎందుకు దాడి చేశార‌న్న విష‌యంలో చంద్ర‌బాబు ఓ స‌రికొత్త వాద‌న‌ను వినిపించారు. ఆ వాద‌న ఎలా? ఎక్క‌డ‌? ఎప్పుడు? అన్న వివ‌రాల్లోకెళితే.. శిక్షణ పూర్తిచేసుకుని విధుల్లో చేరబోతున్న ట్రైనీ ఎస్ ఐలను ఉద్దేశించి కాసేప‌టి క్రితం చంద్రబాబు మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ వినియోగం ద్వారా పరిశోధన చేయడమే  కాకుండా నేరాలను సైతం విజయవంతంగా అరికట్టవచ్చని చంద్రబాబు సూచించారు. తప్పు చేస్తే దొరికిపోతామనే భయమనేది ఉంటే అసలు నేరాలే జరగవని కూడా ఆయ‌న సెల‌విచ్చారు.

ప‌నిలో ప‌నిగా అలిపిరి ఘటనను ఆయన ప్రస్తావిస్తూ ఆ దాడి తనపై ఎందుకు జరిగిందో ట్రైనీ ఎస్ ఐలకు చంద్ర‌బాబు వివరించారు. ఆ మాట‌లు చంద్ర‌బాబు మాట‌ల్లోనే విందాం. *రాయలసీమలో ఫ్యాక్షన్ ఉండేది...హైదరాబాదులో వీధికో గుండా ఉండేవాడు...నగరాల్లోనూ రౌడీయిజం ఉండేది...అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక వీటిని అరికట్టాం...అందుకే నాపై అలిపిరి దాడి జరిగింది* అని చంద్ర‌బాబు తాను న‌క్స‌ల్స్ కు టార్గెట్ గా ఎలా అయ్యాయ‌న్న విష‌యాన్ని చెప్పుకొచ్చారు. మ‌రి నాడు ప్ర‌జా కంట‌క పాల‌న సాగించిన కార‌ణంనే చంద్ర‌బాబును న‌క్స‌ల్స్ టార్గెట్ గా ఎంచుకుని దాడికి తెగ‌బ‌డ్డార‌న్న క‌థ‌నాల మాటేమిట‌న్న విష‌యంపై చంద్ర‌బాబే వివ‌ర‌ణ ఇవ్వాలి. ఎందుకంటే తాను సాగించిన పాల‌న గురించి చంద్ర‌బాబు కంటే మాబాగా చెప్పే వారు ఎవ‌రూ ఉండ‌రు కాబట్టి. ఏది ఏమైనా త‌న‌పై జ‌రిగిన దాడిని చంద్ర‌బాబు ఇలా క‌వ‌ర్ చేసుకుని బాగానే మేనేజ్ చేసేశార‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News