టీడీపీకి ముందు నుయ్యి!..వెనుక గొయ్యి!

Update: 2019-01-10 17:30 GMT
ముందు నుయ్యి... వెనుక గొయ్యి... అంటే ఇదేనేమో. ఏపీలో అధికార పార్టీ టీడీపీ ప‌రిస్థితి ఇప్పుడు అచ్చంగా ఇలాగే ఉంది. సైద్ధాంతికంగా టీడీపీ - కాంగ్రెస్‌ లు బ‌ద్ధ శ‌త్రువులు. అస‌లు టీడీపీ ఆవిర్భావ‌మే.. కాంగ్రెస్ పోటీగా. ఢిల్లీ న‌డి వీధుల్లో తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ గౌర‌వాన్ని కించ‌పరిచేలా వ్య‌వ‌హ‌రిస్తున్న కాంగ్రెస్ పీచ‌మ‌ణిచేందుకే ఆంధ్రుల ఆరాధ్య న‌టుడు - దివంగ‌త సీఎం నంద‌మూరి తార‌క‌రామారావు.. తెలుగు దేశం పార్టీకి ప్రాణం పోశారు. అనుకున్న‌ట్టుగానే ఎన్టీఆర్‌... గ్రాండ్ ఓల్డ్ పార్టీ పీచ‌మ‌ణిచేశారు. పార్టీని పెట్టిన కేవ‌లం 9 నెల‌ల్లోనే ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ‌ద్దె దించిన ఎన్టీఆర్... తెలుగుదేశం పార్టీ జెండాను రెప‌రెలాడించారు. తొలిసారి రాష్ట్రంలో కాంగ్రెసేత‌ర ప్ర‌భుత్వాన్ని స్థాపించారు. జ‌న‌రంజ‌క పాల‌న అందించారు. ఇరి తెలుగు ప్ర‌జ‌లు ఎన్న‌టికీ మ‌రిచిపోలేని చ‌రిత్రే. అయితే ఆ త‌ర్వాత పార్టీని ఎన్టీఆర్ నుంచి చంద్ర‌బాబు లాగేసుకున్నా... పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడి హోదాలో ర‌చించిన పార్టీ సైద్ధాంతిక భావ‌న‌కు మొన్న‌టిదాకా తూట్లు పొడ‌వలేదు.

ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచి పార్టీని హ‌స్త‌గతం చేసుకున్న చంద్ర‌బాబు... ఇప్పుడు పార్టీ సైద్ధాంతిక భావాల‌ను కూడా తుంగ‌లో తొక్కేశారు. ఏ పార్టీకి వ్య‌తిరేకంగా అయితే టీడీపీ తెర మీద‌కు వ‌చ్చిందో... అదే కాంగ్రెస్ పార్టీతో టీడీపీకి జ‌త కుదిర్చారు. అయితే ఈ పొత్తును తెలంగాణ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించేశారు. తిర‌స్క‌రించ‌డంతో పాటుగా వెంట‌బ‌డి కొట్టేంత ప‌ని చేశారు. ఫ‌లితంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హా కూట‌మి పేరిట బ‌రిలోకి దిగిన టీడీపీ - కాంగ్రెస్‌ ల‌కు గ‌ట్టి ప‌రాభ‌వ‌మే ఎదురైంది. ఇది గ‌తం అనుకుంటే... ఏపీ అసెంబ్లీతో పాటు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కూడా గ‌డువు ముంచుకొస్తోంది. మ‌రి తెలంగాణ‌లో మాదిరిగా ఏపీలోనూ కాంగ్రెస్‌ - టీడీపీలు క‌లిసే పోటీ చేస్తాయా? అంటే... ఇరు పార్టీల నేత‌లు కూడా కిమ్మ‌న‌డం లేదు. తేలు కుట్టిన దొంగ‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇరు పార్టీల నేత‌లు... ఏపీలో పొత్తుపై సైలెంట్‌ గానే ఉండిపోతున్నారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో రాష్ట్ర విభ‌జ‌న పాపంతో ఏపీలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు టీడీపీతో పొత్తు కుదిరినా - కుద‌ర‌క‌పోయినా పెద్ద‌గా ఒరిగే లాభం గానీ - జ‌రిగే న‌ష్టం గానీ ఏమీ ఉండ‌వ‌నే చెప్పాలి.

అయితే టీడీపీ విష‌యంలో అలా కాదు క‌దా. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో అల‌వి కాని హామీల‌ను ఇచ్చేసిన చంద్ర‌బాబు అధికార ప‌గ్గాల‌ను చేప‌ట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారాయే. మ‌రి ఇలాంటి ప‌రిస్థితిలో ఎదురుగా బ‌ల‌మైన విప‌క్షంగా వైసీపీ అదికారం చేజిక్కించుకునే అవ‌కాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే... తెలంగాణ‌లో మాదిరి జ‌నం దెబ్బేస్తే?  కొంప కొల్లేరే క‌దా. మ‌రి కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా ఒంట‌రిగానే బ‌రిలోకి దిగితే ప‌రిస్థితి ఏంటి?  తెలంగాణ‌లో పొత్తు పెట్టుకుని ఏపీ వ‌చ్చేస‌రికి కాంగ్రెస్‌తో పొత్తు లేద‌ని చెబితే... జ‌నం ఏమ‌నుకుంటారు?  మ‌రింత‌గా చిత్తుగా ఓడిస్తారా? ఏమో?... ఇవే ప్ర‌శ్న‌లు ఇప్పుడు టీడీపీ అధిస్ఠానంతో పాటు తెలుగు త‌మ్ముళ్ల‌ను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ముందు నుయ్యి... వెనుక గొయ్యి అంటే ఇదే మ‌రి.


Full View

Tags:    

Similar News