బాబు గారి సెక్రటేరియట్ గొప్పలు చూడండి

Update: 2018-12-30 09:28 GMT
గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకోవడం నారా చంద్రబాబు నాయుడి శైలి. అనేక ప్రతికూల పరిస్థితుల్లో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ను మంచి స్థితికి తీసుకొస్తారని ఎన్నో ఆశలతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చారు ఏపీ జనం. కానీ ఆ నమ్మకాన్ని చంద్రబాబు నిలబెట్టుకోలేకోయాడన్నది స్పష్టం. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం కనీస బాధ్యతతో చేసే మామూలు పనులను కూడా అతిగా ప్రచారం చేసుకోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఓవైపు తిత్లి తుపాను ధాటికి జనాలు అల్లాడిపోతుంటే.. అక్కడ జరుగుతున్న సహాయ కార్యక్రమాల గురించి హోర్డింగులు పెట్టుకుని డబ్బా కొట్టుకున్న వైనం అందరినీ విస్మయానికి గురి చేసింది.

బాబుకున్న ఈ ప్రచార యావ గురించి ఎప్పట్నుంచో చూస్తూనే ఉన్నాం. ఈ విషయమై నిన్నటి ప్రెస్ మీట్లో ఉతికి ఆరేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రతి విషయంలోనూ క్రెడిట్ తీసుకునే ఆయన తీరు.. అతిగా ప్రచారం చేసుకునే వైనాన్ని ఆయన తనదైన శైలిలో ఎండగట్టారు. అయినప్పటికీ చంద్రబాబు మారే రకం ఏమీ కాదు. ఇటీవలే ఆయన ఏపీ సెక్రటేరియట్ గురించి గొప్పలు పోతూ ఒక ట్వీట్ చేశారు. ఇది 225 మీటర్లతో ప్రపంచంలోనే అత్యంత పెద్ద సెక్రటేరియట్ గా రూపు దిద్దుకోబోతోందట. రూఫ్ టాప్ హెలిపాడ్ ఉన్న తొలి సెక్రటేరియట్ ఇదేనట. ఇంకా ఇందులో ట్విన్ లిఫ్ట్స్ ఉన్నాయట. వాటి కోసం ఏదో కొత్త టెక్నాలజీ వాడారట. ఇవన్నీ చూపించి గొప్పలు పోతున్నాడు చంద్రబాబు. కానీ సీఎం.. మంత్రులు.. ఉద్యోగులు ఉండే సెక్రటేరియట్ ఎంత గొప్పగా ఉంటే.. ఎంత లగ్జీరియస్ గా ఉంటే జనాలకు ఏంటి? దీని వల్ల ప్రజలకు కలిగే ఉపయోగమేంటి? జనాలకు ఏమీ చేయకుండా బాబు అండ్ కో మాత్రం మితి మీరిన ఖర్చుతో ప్రజా ధనాన్ని దుబారా చేస్తుండటంపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. సెక్రటేరియట్.. అసెంబ్లీ లాంటి వాటి కోసం పరిమితికి మించి భూమి తీసుకోవడం.. ఖర్చు చేస్తుండటాన్ని అందరూ దుయ్యబడుతున్నారు. ఓవైపు ఏపీకి నిధుల్లేవని బీద అరుపులు అరుస్తూ ఇలాంటి గొప్పలకు ఎందుకు పోతున్నారో అర్థం కాని విషయం.

Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?
Tags:    

Similar News