బాబు ఫీలింగ్: బీజేపీతో విడిపోతాన‌నుకోలేదు

Update: 2018-05-05 04:08 GMT
బీజేపీతో పొత్తుకు గుడ్‌ బై చెప్పి సొంత పంథాలో ముందుకు సాగుతున్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు క‌మ‌ళ‌నాథుల‌కు దూరం కావ‌డాన్ని ఇంకా మ‌ర్చిపోలేక‌పోతున్న‌ట్లుంది. ఇంకా బీజేపీతో పొత్తు గురించి చ‌ర్చిస్తుండ‌టాన్ని బట్టి పైగా అవ‌సరం లేని చోట మ‌రీ ఆయ‌న మాట్లాడుతున్న తీరుతో ఈ చ‌ర్చ మొద‌లైంది. ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో నిర్వహించిన  తెలంగాణ టీడీపీ సర్వసభ్య సమావేశంలో నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడ‌తూ బీజేపీతో పొత్తు బెడిసి కొడుతుందని ఊహించలేదని, కాలమాన మార్పులు, ఆయా పార్టీల వైఖరీలలో మార్పుల వల్ల  నిర్ణయాలు మారుతుంటాయని చెప్పారు. రాజకీయంలో  పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న కాలాన్ని బట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ముందుకు సాగాలని టీడీపీ నేతలకు అధినేత చంద్రబాబునాయుడు  సూచించారు.

అయితే 2014 ఎన్నిక‌ల్లో క‌లిసి ప్ర‌యాణం మొదలుపెట్టిన‌ప్ప‌టికీ...ఏపీలో దూరం అవ‌డం కంటే ముందే తెలంగాణ‌లో టీడీపీతో బీజేపీ దూరం అయిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ బీజేపీ అవ‌స‌ర‌మేలేద‌న్నారు. తెలంగాణ‌లో ఆన‌వాళ్లు లేని పార్టీ త‌మ‌ గురించి స్పందించ‌డం ఏమిట‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ తిప్పికొట్టారు. అస‌లు రాబోయే ఎన్నిక‌ల్లో తాము పొత్తుపెట్టుకునేదే లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో మ‌రోమారు చంద్ర‌బాబు అక్క‌ర్లేని పొత్తు అంశాన్ని టీడీపీ నేత‌ల‌కు చెప్ప‌డం ఏంట‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.
 
ఇదిలా ఉండ‌గా పార్టీ నేత‌ల‌తో జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు నాయకులు నిత్యం ప్రజా క్షేత్రంలో పని చేయాలని చంద్ర‌బాబు ఆదేశించారు. 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచుసుకుంటాయని, వాటిని నిశితంగా గమనించి రాజకీయ భవిష్యత్‌ను నిర్మించుకోవడం తెలివైన లక్షణమని అన్నారు. పొత్తుల అంశంపై నేతలు బెంగపడాల్సిన అవసరం లేదని,సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు నిత్యం ప్రజలపక్షాన నిలబడి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు మెచ్చే విధంగా పనులు చేస్తూ నాయకుడిగా ఎదుగాలని ఆయన వివరించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల సమస్యలను పాలక ప్రభుత్వాలు తీర్చలేనప్పుడు ప్రతిపక్షాలు ఆ సమస్యలను ఎత్తిచూపి పాలకులపై ఒత్తిడి తెచ్చి పరిష్కరించాలని అన్నారు. అలసత్వం, గ్రూప్ రాజకీయాలు వద్దని, అందరిని కలుపుకొని పోవాలన్నారు. ఎవరికి సీట్లు ఇవ్వాలో నాకు తెలుసన్న ఆయన జాబితా సిద్ధం చేశానన్నారు. అందరి కంటే ముందే టికెట్లు ప్రకటిస్తానని, మహానాడు తర్వాత మళ్ళీ వస్తా నని, ఆ లోపు కమిటీలన్నీ పూర్తి చేయండని ఆయన సూచించారు.
Tags:    

Similar News