బాబుకు తిట్టే అవ‌కాశం ఇవ్వ‌ని ఈసీ!

Update: 2019-05-03 08:21 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు..కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ  ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల ప్ర‌క్రియ షురూ అయిన నాటి నుంచి ఏదో అంశంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం మీద ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. ఏపీలో పోలింగ్ ముగిసిన త‌ర్వాత ఆయ‌న విమ‌ర్శ‌ల ప‌రంప‌ర ఎక్కువైంది. నిర్ణ‌యాలు తీసుకునే విష‌యంలో ఈసీ తీరును త‌ప్పు ప‌ట్టేందుకు కూడా ఆయ‌న వెనుకాడ‌లేదు.

ఇదిలా ఉంటే.. ఫోనీ తుఫాను నేప‌థ్యంలో ఏపీలోని తుపాను ప్ర‌భావిత జిల్లాల్లో ఎన్నిక‌ల కోడ్ ను మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరారు. బాబు కంటే ముందు ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్.. స్వ‌యంగా ఢిల్లీకి వెళ్లి ఈసీని క‌లిసి.. ఫోనీ తుఫాను తీవ్ర‌త గురించి వివ‌రించి.. త‌మ రాష్ట్రంలో పోలింగ్ పూర్తి అయినందున కోడ్ ఎత్తేయాల‌ని కోరారు.

దీనిపై ఈసీ సానుకూలంగా స్పందించింది. ఒడిశా విష‌యంలో ఈసీ వ్య‌వ‌హార‌శైలిని చూసిన చంద్ర‌బాబు.. ఏపీలోని తుఫాను ప్ర‌భావితం జిల్లాల్లో కోడ్ ఎత్తేయాల‌ని కోరారు.

తాజాగా బాబు విన‌తి మీద కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్పందించింది. ఉత్త‌రాంధ్ర ప‌రిధిలోని నాలుగు జిల్లాల్లో ఎన్నిక‌ల కోడ్ ను ఎత్తి వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. తుఫాను నేప‌థ్యంలో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఎలాంటి విఘాతం రాకుండా ఉండేందుకు వీలుగా తూర్పుగోదావ‌రి.. విశాఖ‌ప‌ట్నం.. విజ‌య‌న‌గ‌రం.. శ్రీ‌కాకుళం జిల్లాల్లో ఎన్నిక‌ల కోడ్ నుంచి మిన‌హాయింపు ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంది. త‌ర‌చూ ఎన్నిక‌ల సంఘం తీరును త‌ప్పు ప‌ట్టే బాబు.. ఇప్పుడాయ‌న రిక్వెస్ట్ కు సానుకూలంగా స్పందించిన నేప‌థ్యంలో హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప‌స ఉన్న విష‌యాల‌ను ఈసీ మాత్రం కాదంటుందా బాబు?

Tags:    

Similar News