పంచాయితీ ఎన్నిక‌ల‌పై కొత్త కొర్రీకి బాబు క‌స‌ర‌త్తు!

Update: 2018-10-24 07:23 GMT
త‌న‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను క‌ప్పి పుచ్చుకోవ‌టానికి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్ని ఇన్నికావు. విప‌క్ష నేత‌గా ఉన్న వేళ‌.. ఎన్నిక‌ల కోసం అదే ప‌నిగా డిమాండ్ చేసే ఆయ‌న‌.. తాను ప‌వ‌ర్లో ఉన్న‌ప్పుడు షెడ్యూల్ ప్ర‌కారం నిర్వ‌హించాల్సిన ఎన్నిక‌ల్ని ఎందుకు నిర్వ‌హించటం లేద‌న్న‌ది ప్ర‌శ్న‌.

గ‌డువు పూర్తి అయిన త‌ర్వాత కూడా ఎన్నిక‌ల్ని నిర్వ‌హించ‌కుండా కాల‌యాప‌న చేస్తున్న బాబు స‌ర్కారుకు మొట్టికాయ వేస్తూ.. తాజాగా హైకోర్టు తీర్పు ఇవ్వ‌టం తెలిసిందే. పంచాయితీ ఎన్నిక‌ల్ని మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో నిర్వ‌హించాల‌ని.. స్పెష‌ల్ ఆఫీస‌ర్ల తో పాల‌నను సాగించ‌టం స‌రికాదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది.

కోర్టు తీర్పు నేప‌థ్యంలో మూడు నెల‌ల గ‌డువులో ఎన్నిక‌ల్ని నిర్వ‌హించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. అయితే.. ఎన్నిక‌ల్ని నిర్వ‌హించిన ప‌క్షంలో.. ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త బ‌య‌ట‌కు వ‌చ్చి.. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల మీద ప్ర‌భావం చూపించే ప్ర‌మాదం పొంచి ఉండ‌టంతో పంచాయితీ ఎన్నిక‌ల్ని వీలైనంత ఆల‌స్యంగా నిర్వ‌హించాల‌న్న‌ది బాబు ప్లాన్ గా చెబుతున్నారు.

తాజాగా కోర్టు తీర్పు వెలువ‌డిన నేప‌థ్యంలో పంచాయితీ ఎన్నిక‌ల్ని నిర్వ‌హించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. దీన్ని అధిగ‌మించేందుకు వీలుగా బాబు మార్క్ కొర్రీని తెర మీద‌కు తెచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు వెలువ‌డిన వెంట‌నే కోర్టు మాట త‌న‌కు శిరోధార్య‌మంటూ మాట‌లు చెప్పిన బాబు.. చేత‌ల్లో మాత్రం మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెబుతున్నారు.

పంచాయితీ ఎన్నిక‌ల్నికోర్టు చెప్పిన‌ట్లు కాకుండా.. మ‌రికొంత కాలం దాట‌వేసేలా పాత అంశాన్ని స‌రికొత్త‌గా తెర మీద‌కు తీసుకురావాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున‌నారు. 2013లో జ‌రిగిన పంచాయితీ ఎన్నిక‌ల స‌మ‌యంలో అన్ని వ‌ర్గాల‌కు క‌లిపి ఇచ్చిన రిజ‌ర్వేష‌న్లు 60 శ‌తానికి దాటిపోవ‌టంతో గొడ‌వ ప్రారంభ‌మైంది. దీంతో.. కేసులు న‌మోదు కావ‌టంతో మొత్తం రిజ‌ర్వేష‌న్ల‌ను 50 శాతం మించ‌కుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టు చెప్పింది.

నాడు కోర్టు చెప్పిన మాట‌ను తెర మీద‌కు తీసుకొచ్చి.. రిజ‌ర్వేష‌న్ల‌ను 50 శాతం కుదించే క‌స‌ర‌త్తు పూర్తి కాలేద‌న్న కొర్రీని చూపించ‌టం ద్వారా తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ప‌క్క‌న పెట్టేలా ప్లాన్ చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. గ‌తంలో కోర్టు ఇచ్చిన తీర్పును ఇప్పుడు త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలకు అడ్డుగా పెట్టుకోవాల‌ని చూస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. టెక్నాల‌జీలో తోపుగా.. చేతి వేళ్ల మీద‌నే రాష్ట్ర డేటా మొత్తం త‌న ద‌గ్గ‌ర ఉంటుంద‌ని గొప్ప‌లు చెప్పే చంద్ర‌బాబు.. ఈ రిజ‌ర్వేష‌న్ల లెక్క‌ల్ని గ‌డిచిన నాలుగేళ్ల కాలంలో ఎందుకు ఒక కొలిక్కి తీసుకురాలేద‌న్న ప్ర‌శ్నను ప‌లువురు సంధిస్తున్నారు. మ‌రి.. దీనికి బాబు ఏమ‌ని బ‌దులిస్తారో చూడాలి.

Tags:    

Similar News