అంతా అయిపోయాక... ఒత్తిడేందీ బాబూ!

Update: 2018-02-01 11:55 GMT
న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం త‌న ఐదేళ్ల పాల‌న‌కు సంబంధించి చివ‌రి బ‌డ్జెట్‌ను నేటి ఉద‌యం పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో క‌రుకుపోయిన ఏపీని ఆదుకునేందుకు ఈ బ‌డ్జెట్‌లో మోదీ స‌ర్కారు భారీ కేటాయింపులు చేస్తుంద‌ని అంతా ఆశించారు. ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ, ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు అయితే మరింత మేర ఆశ‌లు పెట్టుకున్నార‌నే చెప్పాలి. అందుక‌నుగుణంగానే మొన్న ప్ర‌ధానితో జ‌రిగిన భేటీలో చంద్ర‌బాబు రాష్ట్ర డిమాండ్ల‌ను 17 పేజీల‌తో కూడిన విన‌తిప‌త్రాన్ని మోదీ ముందు పెట్టారు. ఈ దిశ‌గా నాడు సుదీర్ఘ చ‌ర్చే జ‌రిగింది. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌కు మోదీ నుంచి కూడా సానుకూల స్పంద‌న వ‌చ్చింద‌ని, ఫ‌లితంగా ఈ బ‌డ్జెట్‌ లో ఏపీకి భారీగానే కేటాయింపులు రానున్నాయని టీడీపీ ఆశ‌లు పెట్టుకుంటే... అదే విష‌యాన్ని టీడీపీ అనుకూల మీడియా తాటికాయ‌లంత అక్ష‌రాల‌తో ప్ర‌త్యేక క‌థ‌నాలు రాసేసింది.

అయితే నేటి ఉద‌యం పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టిన బడ్జెట్ టీడీపీ అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసింద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో విప‌క్షాల కంటే ముందుగానే రంగంలోకి దిగుదామ‌న్న ఉద్దేశంతో చంద్ర‌బాబు మొత్తం త‌న షెడ్యూల్‌ ను మార్చేసుకుని టీడీపీ ఎంపీల‌తో అప్ప‌టిక‌ప్పుడు టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. బ‌డ్జెట్లో ఏపీకి తీరని అన్యాయం జ‌రిగింద‌న్న విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు ప్ర‌త్యేకించి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల చెవిన వేయాల‌ని - అంతేకాకుండా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోగా మ‌రో బ‌డ్జెట్ వ‌చ్చే అవ‌కాశాలేమీ లేవ‌ని, ఏం చేసినా ఇప్పుడు చేయాల‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేయాల‌ని కూడా ఆయ‌న త‌న పార్టీ ఎంపీల‌కు సూచించిన‌ట్లుగా స‌మాచారం.

ఈ సంద‌ర్భంగా ఇప్ప‌టిదాకా ఏ ఒక్క బ‌డ్జెట్‌ లోనూ ఏపీకి న్యాయం చేయ‌ని బీజేపీ ప‌ట్టుకుని ఊగులాడ‌టం ఇంకేమీ బాగాలేద‌ని. మీరు ఆదేశిస్తే... ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామ చేసేస్తామ‌ని కూడా ప్ర‌స్తావించార‌ట‌. అయితే ఈ ప్ర‌తిపాద‌న‌తో షాక్ తిన్న చంద్ర‌బాబు... ఆ త‌ర‌హా ఆలోచ‌న‌లు చేయొద్ద‌ని - మార్చిలో ప్ర‌త్యేక ప్యాకేజీకి సంబంధించి కేటాయింపులు జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌ని స‌ముదాయించార‌ట‌. రాజీనామాల ఆలోచ‌న‌ను ప‌క్క‌న‌పెట్టేసి... రాష్ట్రానికి నిధుల సాధ‌న‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న ఎంపీల‌కు దిశానిర్దేశం చేసిన‌ట్లుగా స‌మాచారం. అయితే మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది. ఏపీకి ఎప్ప‌టిక‌ప్పుడు మొండి చేయి విదిలిస్తున్న కేంద్రం వైఖ‌రిపై ఇక‌పై స‌హించ‌రాద‌న్న భావ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నార‌ట‌.

ఎంపీల‌తో అప్ప‌టిక‌ప్పుడు టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన చంద్ర‌బాబు సాయంత్రం లోగా అందుబాటులో ఉన్న త‌న కేబినెట్ మినిస్ట‌ర్స్‌ తో ప్ర‌త్యేకంగా స‌మావేశం కానున్నార‌ట‌. నిత్యం మొండి చేయి చూపిస్తున్న బీజేపీతో ఇంకెంత కాలం క‌లిసి సాగుతామ‌న్న కోణంలో యోచిస్తున్న చంద్ర‌బాబు... ఈ భేటీలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇదంతా చూస్తుంటే... బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌కు ముందే ప్ర‌ధాని మోదీపై ఒత్తిడి తేవాల్సిన చంద్ర‌బాబు... ఆ విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టేసి బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న పూర్తి అయి, పార్ల‌మెంటు ముందుకు వ‌చ్చిన త‌ర్వాత కేంద్రంప ఒత్తిడి పెంచాల‌ని నిర్ణ‌యించడం చూస్తుంటే... చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగానే ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News