బాబు కేబినెట్ లో పాపం ఆ ‘ఇద్దరు’!

Update: 2018-01-07 09:24 GMT
అసలే చంద్రబాబునాయుడు సిటింగుల్లో ఎవరికి టికెట్లు ఇస్తానో.. ఎవరికి ఇవ్వలేనో ఇప్పుడే చెప్పలేను.. అంతా సర్వేల మీద ఆధారపడి ఉంటుంది అని పదేపదే హెచ్చరిస్తూ ఉంటారు. దానికి తగినట్టే.. ఆయన కేబినెట్ లోని అనేక మంది మంత్రుల పనితీరు సరిగా లేదని చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. కేవలం మంత్రిగా పనితీరు మాత్రమే నియోజకవర్గంలో ప్రజల వద్ద ఇమేజి సవ్యంగా లేకపోయినా టిక్కెట్ డౌటే అనే సంకేతాలు చంద్రబాబు పలుమార్లు ఇస్తూనే ఉన్నారు. ఈ భయం సిటింగులు చాలా మందిలో ఉన్నది గానీ.. తాజాగా ఓ ఇద్దరు మంత్రుల గురించి మాత్రం.. టిక్కెట్ దక్కడం డౌటు అనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. తమాషా ఏంటంటే.. ఈ ఇద్దరూ కూడా.. నెంబర్ టూ లాంటి హోదాను అనుభవిస్తున్న వారే. ఒకరు డిప్యూటీ సీఎం మరియు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాగా - మరొకరు అప్రకటిత నెంబర్ టూ యనమల రామకృష్ణుడు.

ఈ ఇద్దరు మంత్రులకు లోకల్ గా పరిస్థితి సవ్యంగా లేదని.. టికెట్ దక్కించుకునే అవకాశం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. యనమల రామకృష్ణుడుకు గెలిచే అలవాటు పోయింది. గత ఎన్నికల్లో బరిలోకి తమ్ముడిని దించితే ఆయన కూడా ఓడిపోయాడు. ఈ నాలుగేళ్ల పదవీకాలంలో ఆర్థిక మంత్రిగా- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీస్తూ ఉండగా.. ఆయన ప్రేక్షకుడిగా మారినట్లే....

సొంత నియోజకవర్గంలో తన ఇమేజి దివాళా తీస్తున్నా కూడా ప్రేక్షకుడిగానే ఉండిపోయారని.. మంత్రి పదవిని వాడుకుని.. నియోజకవర్గంలో పట్టు పెంచుకోవడంలో ఫెయిలయ్యారని పార్టీ సర్వేల సారాంశంగా చంద్రబాబుకు సమాచారం అందినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీ హోదాలోనే మంత్రిగా ఉన్నారు. ఆయనను ఎమ్మెల్యే బరిలో దించి సీటు నష్టపోవడం కంటె అలాగే ఆ పదవిలోనే కొనసాగిస్తే బెటర్ అని చంద్రబాబు భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

చినరాజప్ప పరిస్థితి పాపం.. అయోమయంగా మారుతోంది. తనది కాకపోయినా.. చంద్రబాబు ఆదేశాల మేరకు పెద్దాపురం వచ్చి బరిలోకి దిగిన చినరాజప్ప కష్టపడి గెలిచి.. ఆ తర్వాత.. కార్యకర్తలను కలుపుకుపోవడానికి ఇంకా చాలా కష్టపడ్డారు. అయితే అప్పట్లో పార్టీని వీడిపోయి ఉన్న బొడ్డు భాస్కర రామారావు తిరిగి పార్టీలోకి రావడం.. చంద్రబాబునుంచి టిక్కెట్ హామీతో ఎన్నికలకు సిద్ధం అవుతుండడం సందేహాలకు తావిస్తోంది. చినరాజప్పను కూడా పెద్దాపురం సీటు దక్కకపోవచ్చుననే ప్రచారం పార్టీలో జరుగుతోంది. మరి చంద్రబాబుకు ఎంతో విధేయుడు అయిన ఆయనను కూడా ఎమ్మెల్సీ సీటు ద్వారానే సంతృప్తి పరుస్తారా అనే ప్రచారం కూడా జరుగుతోంది.
Tags:    

Similar News