మెగా అక్వాఫుడ్ పార్క్ పై బాబు రియాక్షన్ ఇదే..

Update: 2016-10-16 09:19 GMT
పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మెగా అక్వా ఫుడ్ పార్క్ కారణంగా జరిగే నష్టంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియా ముందుకు వచ్చి ఏపీ ప్రభుత్వం దృష్టికి వెళ్లేలా మాట్లాడటం.. మెగా అక్వా ఫుడ్ పార్క్ కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా కాలుష్య కాసారంగా మారిపోవటమే కాదు.. నదీ జలాలు తీవ్రంగా కలుషితమవుతాయన్న విషయాన్ని తెర మీదకు తేవటం తెలిసిందే. దాదాపు ఏడాదికి పైనే సాగుతున్న ఈ ఆందోళనపై పవన్ రియాక్ట్ అయిన వెంటనే గంటల్లో స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆదివారం ఉదయం విజయవాడలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశానికి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ తోపాటు.. భీమవరం.. నరసాపురం ఎమ్మెల్యేలతో పాటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు.. ఇతర ప్రజాప్రతినిధుల హాజ‌ర‌య్యారు. వివాదాస్పదంగా మారిన మెగా అక్వాఫుడ్ పార్క్ అంశంపై వస్తున్న ఆరోపణలు.. విమర్శలకు సంబంధించిన వివరాల్ని అధికారులు.. ప్రజాప్రతినిధుల నుంచి తెలుసుకున్న చంద్రబాబు.. ఈ వ్యవహారంపై రియాక్ట్ అయ్యారు. అక్వాఫుడ్ పార్క్ కారణంగా పర్యావరణం కలుషితం అవుతుందన్న భయాందోళనలు అక్కడి ప్రజల్లో బలంగా ఉన్న నేపథ్యంలో.. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో భీమవరం.. నరసాపురం ఎమ్మెలతో పాటు.. మరికొందరితో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో కాలుష్య నియంత్రణ అధికారులు కూడా ఉంటారు. అక్వా పార్క్ మీద ప్రజల్లో నెలకొన్న భయాందోళనల్ని తీర్చటంతో పాటు.. కాలుష్య రహితంగా పార్కును ఏర్పాటు చేయాలన్న ఆదేశాలు జారీ చేశారు.

అక్కడి ప్రజలు ఫుడ్ పార్క్ వద్దనటం లేదని.. కాలుష్యం లేకుండా చూడాలన్నదే వారి డిమాండ్ గా భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు మీడియాకు చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం రూ.25 కోట్లు ఖర్చు పెట్టిన నేపథ్యంలో అక్కడి పరిశ్రమను వేరే ప్రాంతానికి తరలించటం కష్టమని వ్యాఖ్యానించారు.ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే కాలుష్య నీటిని ప్రత్యేక పైపులైన్లు ఏర్పాటు చేసి. సముద్రంలోకి విడిచి పెట్టేలా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లుగా వెల్లడించారు.ఈ ప్రత్యేక పైపులైన్ కోసం రూ.25 కోట్లు ఖర్చు అవుతుందని.. ఈ మొత్తాన్ని కంపెనీనే భరించాలని సీఎం నిర్ణయించారు. ఒకవేళ ఫుడ్ పార్క్ కానీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. దాన్ని సీజ్ చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా పవన్ కల్యాణ్ సీన్లోకి వచ్చి.. ఒక ఇష్యూను తెర మీదకు తెచ్చిన గంటల్లో స్పందించటమే కాదు.. సమీక్ష నిర్వహించి.. పలు నిర్ణయాలు తీసుకోవటం ద్వారా చంద్రబాబు సానుకూల సందేశాన్ని పంపినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News