రాసలీలలకు.. ఓటుకునోటుకు లింకు పెట్టటమా?

Update: 2015-06-26 04:21 GMT
సంబంధం లేని వ్యవహరాల్ని సమయానుకూలంగా తెరపైకి తీసుకొచ్చి విచిత్రమైన వాదనను వినిపించటం ఈ మధ్య ఒక అలవాటుగా మారింది. తాజాగా సోషల్‌ నెట్క్‌వర్స్స్‌లో కనిపిస్తున్న ఒక వీడియో గురించి ప్రస్తావించాలి.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో చేసిన ఒక వ్యాఖ్యకు సంబంధించిన క్లిప్పింగ్‌ వైరల్‌ అవుతోంది. గతంలో ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నారాయణదత్‌ తివారీ ఒక మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక మొదటిపేజీలో ప్రముఖంగా ప్రచురించటం.. ఒక వ్యక్తి నైతికత.. ఒక మహిళతో అభ్యంతరకరంగా.. రాజ్‌భవన్‌లో సాగించిన రాసలీలలు అప్పట్లో సంచలనం సృష్టించటం తెలిసిందే.

దీనిపై నాడు విపక్షంలో ఉన్న చంద్రబాబు మాట్లాడుతూ.. గవర్నర్‌పై వచ్చిన ఆరోపణలు నిజమైతే రాజీనామా చేసి వెళ్లిపోవటం మంచిదని.. ఒకవేళ అలా చేయని పక్షంలో ఆయన్ను పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

ఒక గవర్నర్‌ మహిళతో రాజ్‌భవన్‌లో రాసలీలకు.. ఓటుకు నోటు వ్యవహారాన్ని లింకు పెట్టటం కాస్తంత చిత్రమే. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తప్పులు చంద్రబాబుకు మాత్రమే అంటగట్టటం కనిపిస్తుంది. రాజకీయాలు వ్యక్తిగత వైరంగా మారిపోయి.. ప్రజాసంక్షేమం ఏ మాత్రం పట్టని కాలం ఇప్పుడు నడుస్తోంది. ఇక.. అదే తీరులో రాజకీయ నేతల్ని సైతం గుడ్డిగా అభిమానించి.. వారి కోసం గుడ్డలు చింపుకునే పరిస్థితి కనిపిస్తోంది.

రాజకీయాల్ని కులం పరిధిలోకి పరిమితం చేసే వికృత క్రీడ ఇప్పుడు నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఇలాంటి వీడియోలు ప్రచారంలోకి రావటం ఆశ్చర్యపరిచే అంశం కాదు. ఇక.. చంద్రబాబు అప్పుడు రాజీనామా చేయాలి అన్నారు కాబట్టి.. ఓటుకునోటు కేసులో బాబు రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్న అంశాన్ని చూస్తే.. ఈ విషయంలో వీడియో సాక్ష్యంగా దొరికింది రేవంత్‌ రెడ్డి మాత్రమే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఇక.. బాబు ఆడియో టేపు ఉదంతంలో ఎక్కడా తమకు అనుకూలంగా ఓటు వేయమని చెప్పలేదు (ఒకవేళ టేపులు నిజమైతే). స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలన్న మాటను మర్చిపోలేం.

ఇక.. చంద్రబాబు తప్పు చేశారనే అనుకుందాం. అలా అనుకున్నప్పుడు.. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దానికి కారకులు ఎవరు? అన్న ప్రశ్నలు కూడా వేసుకోవాలి. ఆపరేషన్‌ ఆకర్ష్‌ను స్టార్ట్‌ చేసిన వైఎస్‌ విషయంలో గగ్గోలు పెట్టిన నాటి కేసీఆర్‌.. ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా అదే విధానాన్ని అమలు చేస్తున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు. తనను ఏ పార్టీ అయితే ఇబ్బంది పెట్టిందో.. ఆ పార్టీతో పాటు.. మిగిలిన పార్టీలకు ఆయన సినిమా చూపిస్తున్నారు.

అయితే.. ఏ మహానేత కారణంగా తాను మానసికంగా వేదనకు గురి అయ్యానో.. అదే మహానేత కొడుకుతో కలిసి.. చంద్రబాబు మీద రాజకీయ ప్రతీకారం తీర్చుకోవటానికి పావులు కదపటం ఒక విశేషంగా చెప్పాలి. తమ పార్టీకి చెందిన నేతల్ని ఒకరి తర్వాత ఒకరిగా కొనేస్తూ.. తెలంగాణరాష్ట్రంలో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్న క్రమంలో.. ఒక షాక్‌ ఇవ్వాలని ఒక రాజకీయ నేత అనుకోవటం తప్పుగా భావించలేం.

ఇక్కడ చంద్రబాబు చేశారని చెబుతున్న పనిని సమర్థించటం లేదు. ఆయన అలా చేయటానికి దారి తీసిన అంశాల్ని మాత్రమే ప్రస్తావిస్తున్నాం. తప్పు ఎవరు చేసినా తప్పే. కాకపోతే.. ఈ తప్పుడు ఆటను మొదలు పెట్టిన వారిని వదిలేయటం ఏ మాత్రం క్షేమకరం కాదు.

వ్యక్తిగత అభిమానాల్ని పక్కన పెట్టేసి..సాపేక్షంగా ఆలోచిస్తే.. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి.. బలమైన రాజకీయ పక్షానికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తికి.. తమ పార్టీ బలంగా ఉన్న మరో రాష్ట్రంలో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారటాన్ని జీర్ణించుకోగలరా? అన్నది ప్రశ్న. అందులో నుంచే ఇప్పుడు చోటు చేసుకున్న  పరిణామాలు.

ఇక్కడ ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే.. దొరికిన దొంగ గురించి మాత్రమే కానీ.. దొరకని దొంగ గురించి.. దొంగతనం గురించి మాట్లాడటం తగ్గించేశారు. పార్టీ ఫిరాయింపులు మిగిలిన పెద్ద పెద్ద అంశాల జోలికి వెళ్లకుండా.. ఒక చిన్న విషయాన్ని చూస్తే పరిస్థితి ఇట్టే అర్థం అవుతుంది. అధికారికంగా ఒక ప్రతిపక్ష పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న వ్యక్తిని అధికారపక్షం మంత్రిగా ఎలా చేస్తుంది? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి. పార్టీ ఫిరాయించిన వారు బంగారు తెలంగాణ కోసం.. తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నారని సమర్థించుకోవచ్చు. మరి.. విపక్ష ఎమ్మెల్యేని అధికార మంత్రిగా ఎందుకు చేశారన్న వాదనను ఎలా సమర్థించుకుంటారన్న ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేనిది.

అందుకే.. గవర్నర్‌ రాసలీలల సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను.. తాజాగా చోటు చేసుకున్న ఓటుకు నోటు వ్యవహారాన్ని లింకు పెట్టటం అర్థం లేని పనిగా చెప్పొచ్చు. ఇక్కడ లింకు పెట్టటం తప్పు అని చెబుతున్నామే తప్పించి.. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు వైఖరి కరెక్ట్‌ అని మాత్రం చెప్పటం లేదన్న విషయం మర్చిపోకూడదు. ఒకరిని తప్పు పట్టే ముందే.. దాని ముందు వెనుకా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు. అలా ఆలోచించినప్పుడు మాత్రమే.. సమస్య ఎక్కడ షురూ అవుతుందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

Tags:    

Similar News