దత్తత గ్రామంపై ప్రేమ చూపని చంద్రబాబు

Update: 2015-10-12 07:58 GMT
 రాష్ట్రంలో గ్రామాల దత్తతను ఉద్యమంలా చేపట్టి గ్రామాల అభివృద్ధికి మార్గం వేయాలని భావించిన సీఎం చంద్రబాబు తాను స్వయంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అయితే... ఇంతవరకు ఆయన అక్కడ అడుగుపెట్టకపోవడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ జిల్లాలోని పెదల బుడు గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన తరువాత.. అక్కడికి వస్తున్నట్లు పలుసార్లు ప్రకటించడం, ఆ తర్వాత రద్దు చేసుకోవడం అనవాయితీగా మారింది. పెదలబుడుకు వస్తున్నట్లు ఇప్పటికి మూడుసార్లు ప్రకటించినా సీఎం ఇంతవరకు ఒక్కసారి కూడా అక్కడ పర్యటించలేదు... తాజాగా ఆదివారం అక్కడ పర్యటించాల్సిన సీఎం ఈసారి కూడా వాయిదా వేసుకున్నారు.

ఆదివారం పెదలబుడు వస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించినా తాజాగా దాన్ని రద్దు చేసుకొని విశాఖలో హుదూద్‌ పునరంకిత సభకే పరిమితం అవుతున్నారు. చంద్రబాబు పెదల బుడుకు రాకపోవడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీలో సిఎం అడుగుపెడితే బాక్సైట్‌ పై ప్రభుత్వ వైఖరేంటో స్పష్టం చేయాల్సి వుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తరువాత బాక్సైట్‌ తవ్వకాల అనుకూల వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా సమాయత్తం చేసే పని చేస్తున్నారు. బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకించిన వారిని మావోయిస్టు అనుకూలవాదులుగా చిత్రీకరిస్తూ పోలీసులు తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల ముగ్గురు టీడీపీ నేతలను మావోయిస్టులు అపహరించారు కూడా.  గతంలో మాటెలా ఉన్నా తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడకు వెళ్లడం ఇబ్బందికరమన్న ఉద్దేశంతోనే చంద్రబాబు పర్యటన వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. బాక్సైట్ విషయంలో నిరసనలు ఎదుర్కోవాల్సి రావచ్చని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.

మరోవైపు బాక్సైట్ ఇష్యూలోనే ముగ్గురు టీడీపీ నేతలను మావోయిస్టులు అపహరించడంతో.... భద్రత కారణాల రీత్యా కూడా ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడి ఉండొచ్చు. గతంలో మావోయిస్టుల దాడిలో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన చంద్రబాబు మరోసారి రిస్కు చేయడానికి ఇష్టపడకపోవడం కూడా ఒక కారణం.

కారణాలేవైనా కానీ సాక్షాత్తు సీఎం దత్తత తీసుకోవడంతో తమ గ్రామం దశ తిరుగుతుందని భావించిన పెదలబుడు ప్రజలకు నిరాశే ఎదురైంది.
Tags:    

Similar News