బాబు ఇప్పటికైనా అర్థం చేసుకోగలరో లేదో..?

Update: 2016-09-08 05:51 GMT
ఇంతకూ ఒక ప్రాంతానికి పరిశ్రమలు ఎందుకు వస్తాయి? పారిశ్రామికవేత్తలు ఒక ప్రాంతాన్ని తాము పరిశ్రమలు పెట్టడానికి లేదా, తమ వ్యాపార కేంద్రాలుగా మార్చుకోవడానికి ఎంపిక చేసేముందు ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు? ఈ విషయంలో చంద్రబాబునాయుడుకు ఎలాంటి అవగాహన ఉందో మనకు తెలియదు గానీ.. తాజాగా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. ఆయన పెట్టిన ప్రెస్‌ మీట్‌ లో వెల్లడించిన ఒక అంశం గమనిస్తే.. ఆయన తెలుసుకోవాల్సింది చాలా ఉందనిపిస్తుంది.

చంద్రబాబు తాను అమెరికా వీధుల్లో నడిచి హైదరాబాదుకు సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలను తీసుకువచ్చానంటూ పదేపదే ఊదరగొడుతూ ఉంటారు. అలాగే... ఇప్పుడు అమరావతికి - ఏపీకి పరిశ్రమల్ని కంపెనీలను తీసుకువస్తానంటూ.. ఆయన ప్రత్యేకవిమానం వేసుకుని.. దేశాలు దేశాలు తిరిగేస్తూ ఉంటారు. అయితే ఆయన తిరుగుళ్లవల్ల సాధించేదేమీ లేదని.. నిజానికి పరిశ్రమలు పెట్టేవారు ఎంచుకునే ప్రాతిపదిక వేరే ఉంటుందని చంద్రబాబు మాటల్లోనే అర్థమవుతున్నదని ప్రజలు అంటున్నారు.

చంద్రబాబు రాత్రి మాట్లాడుతూ.. గూగుల్‌ వారు ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌ వేర్‌ కోసం హైదరాబాదులో 20 మంది ఉద్యోగుల్ని తీసుకుంటే అందులో 13 మంది ఏపీ వారని - అందుకే ఇక్కడ ఏపీలో ఒక ఇన్నోవేషన్‌ కేంద్రం పెట్టాలని చూస్తున్నారని అన్నారు. అంటే దాని భావం ఏమిటన్న మాట.. ఏపీ కుర్రాళ్ల ప్రతిభను గమనించి మాత్రమే.. అక్కడకు పరిశ్రమలు తరలివస్తున్నాయి.. లేదా గూగుల్‌ రావడానికి ముచ్చటపడుతున్నది తప్ప.. చంద్రబాబు చూపిస్తున్న మాయకు భ్రమపడి కాదని ఆయన తెలుసుకోవాలి. ఆయన విమానాలు వేసుకు తిరగడం వల్ల ఒక్కరూ రాలేదని, ఏపీ కుర్రాళ్ల ప్రతిభను గుర్తించిన కంపెనీలు మాత్రమే వస్తున్నాయని బాబు తెలుసుకుంటే.. కనీసం కుర్రాళ్ల నైపుణ్యాల మెరుగుదలకు సర్కారు శ్రద్ధ పెడుతుంది.
Tags:    

Similar News