కరణం బలరాం ఎవరో చంద్రబాబుకు తెలియదట

Update: 2016-06-23 04:55 GMT
 ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా ఉంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి వ్యవహారం.. ఈ మాట అంటున్నదెవరో కాదు - సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలే చంద్రబాబు తీరును చూసి ఆవేదనతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పర్యటనలో చంద్రబాబు వ్యవహరించిన తీరు కూడా ఆ ఆరోపణలకు ఊతమిస్తోంది. తెలుగు దేశం పార్టీని చిరకాలంగా అంటిపెట్టుకుని ఉన్న కరణం బలరాం వైపు కన్నెత్తి కూడా చూడకుండా కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలతో ముచ్చట్లాడారు. ఇది కరణం బలరాం - ఆయన వర్గానికే కాదు మిగతా జిల్లాల్లోని టీడీపీ సీనియర్లనూ షాక్ కు గురిచేసింది.

రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీని ప్రారంభించేందుకు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు వెళ్లిన సందర్భంగా చంద్రబాబు అక్కడ ఇంతకుముందెన్నడూ లేనట్లుగా పార్టీ వర్గాలకు షాకిచ్చారు.  గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్లపై విజయం సాధించి ఇటీవలే తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్ - పోతుల రామారావు - ముత్తుముల అశోక్ రెడ్డిలను పేరు పెట్టి పలకరించిన చంద్రబాబు.. ఆ జిల్లాలో పార్టీ సీనియర్ నేత - పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరణం బలరాం వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. వేదిక మీదకు ఎక్కగానే అక్కడ కనిపించిన కరణం బలరాంను చంద్రబాబు చూసీ చూడనట్లుగానే ముందుకెళ్లిపోయారు. ఆ తర్వాత కనిపించిన జిల్లా ఇన్ చార్జీ మంత్రి రావెల్ కిశోర్ బాబు - చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ లను ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకు సాగారు. ఈ పరిణామం అందరినీ ఆలోచనలో పడేసింది. మిగతా జిల్లాల్లోనూ వైసీపీ నుంచి వచ్చినవారికే ప్రాధాన్యమిచ్చి సీనియర్ నేతలను విస్మరిస్తే పార్టీ పరిస్థితి ఏమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే... అన్నిచోట్లా ఇదే సూత్రాన్ని చంద్రబాబు అమలు చేయబోరని.. కరణం బలరాంను దారిలో పెట్టేందుకే ఉద్దేశపూర్వకంగా ఆయన నెగ్లెక్టు చేశారన్న వాదనా వినిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం దూకుడు సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల గొట్టిపాటి రవితో కరణం బలరాం తలపడిన తీరు - తీవ్ర ఘర్షణల నేపథ్యంలో చంద్రబాబు వద్ద ఆ ఘటనల మొత్తం సమాచారం ఉందని.. బలరాం కారణంగానే పార్టీలో విభేదాలు ఏర్పడుతున్నాయన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఆయన్ను నెగ్లక్టు చేశారని తెలుస్తోంది. గొట్టిపాటి చేరికను చివరి దాకా అడ్డుకునేందుకు యత్నించిన బలరాం... మొన్నామధ్య బహిరంగంగా గొట్టిపాటి వర్గంతో వాదులాటకు దిగడంతో పాటు గన్ మెన్ ను కూడా తోసేసి, మోచేతితో పొడిచిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే బలరాం పట్ల చంద్రబాబు ముభావంగా వ్యవహరించారని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పార్టీ ప్రతిష్ఠను మంటగలిపితే క్షమించేది లేదని గట్టిగా హెచ్చరించేందుకే చంద్రబాబు ఇలా చేశారని.. సీనియర్ నేత కావడంతో బలరాంను మాటలతో హెచ్చరించకుండా తన చేతలతో ఆయనకు అర్థమయ్యేలా చెప్పారని అంటున్నారు.
Tags:    

Similar News