భూసేకరణకు బ్రేకులెయ్యకుంటే బ్యాండే బాబు..?

Update: 2015-09-16 07:37 GMT
సున్నిత అంశాల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అధికారంలోకి వచ్చిన బాబుకు.. ఏ విషయంలో ఎలా వ్యవహరించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పదకొండేళ్లుకు పైనే ముఖ్యమంత్రిగా.. పదేళ్లుగా విపక్ష నేతగా వ్యవహరించిన చంద్రబాబుకు.. దేనికి ప్రజామోదం లభిస్తుంది? దేనికి ప్రజాగ్రహం వ్యక్తమువతుందన్న విషయాలు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాదిరి.. అధికారం లేనప్పుడు మరోలా వ్యవహరించే సగటు రాజకీయ అధినేతకు చంద్రబాబు తానేమీ మినహాయింపు కాదన్న విషయాన్ని తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలతో చెప్పకనే చెప్పేస్తున్నారు.

రాజధాని కోసం వేలాది భూములు సేకరించే విషయంలో విమర్శలు ఎదుర్కోవటం.. భూసేకరణకు జీవో జారీ చేసి మరీ వెనక్కి తగ్గటం లాంటివి తెలిసిందే. రాజధాని భూసేకరణ విషయం చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా పలువురి విమర్శలు ఎదుర్కొన్న చంద్రబాబు సర్కారు.. వెనువెంటనే పలు ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. భూసేకరణ సందర్భంగా ప్రచారంలోకి పలు అంశాలు వస్తుంటాయి.

నిజానికి ఇలాంటి సందర్భాల్లో నిజాల కంటే కూడా పలు  అసత్యాలు ప్రచారం అవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా వ్యవహరించి.. ప్రజల సెంటిమెంట్ల దెబ్బ తినకుండా ఆగ్రహం వ్యక్తం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటివి వదిలేసి.. ఎడాపెడా జీవోలు జారీ చేసేసి భూసేకరణ మీద అవగాహన కల్పిస్తామని.. ప్రజలు ఒప్పుకుంటేనే భూమిని సేకరిస్తామని చెబుతూ.. మరోవైపు అధికారులు భూసేకరణ ప్ర్రకియను స్టార్ట్ చేయటం విమర్శలకు తావిస్తుంది. ఇలాంటి ప్రక్రియపై పలు ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాని సెగ ఇప్పటికే మంత్రులు.. ఎంపీలతో పాటు పలువురు తెలుగు తమ్ముళ్లు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భూసేకరణ అంశంపై వెంటనే బ్రేకులేసి.. బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరి.. బాబు ఆ దిశగా ఆలోచిస్తారా? పవర్ ఉన్న షోకు ప్రదర్శించి.. లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టుకుంటారా? అన్నది కాలమే బదులివ్వాలి.
Tags:    

Similar News