లోక‌ల్ ఎల‌క్ష‌న్స్‌ పై అలా డిసైడ్ అయ్యారా..!

Update: 2016-11-07 06:57 GMT
ఏపీలో త్వ‌ర‌లో జ‌ర‌గుతాయ‌ని భావిస్తున్న మునిసిప‌ల్‌ - కార్పొరేష‌న్ ఎన్నిక‌లు అధికార టీడీపీకి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకున్నా.. జ‌రిగిపోయిన రెండున్న‌రేళ్ల పాల‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నా ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి స్థానికంగా సైకిల్‌ ను ప‌రుగులు పెట్టించాల‌ని బాబు అండ్ కో ప‌క్కా ప్లాన్‌ తో రెడీ అయిపోతున్నారు. అయితే, ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా నిర్వ‌హించాలా?  ప‌రోక్షంగా నిర్వహించాలా? అనే విష‌యంలో మాత్రం టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాడ‌ట‌. దీనికి కార‌ణం ఏమంటే.. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు వెళ్తే.. ప్ర‌భుత్వంపై ఏదైనా వ్య‌తిరేక‌త ఉంటే ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని, పోయిపోయి వైకాపాకి సీట్లు అప్ప‌గించిన‌ట్టు అవుతుంద‌ని టీడీపీలోని సీనియ‌ర్ నేత‌లు చెబుతున్నార‌ట‌.

మ‌రోప‌క్క‌, ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేకత ఉంద‌ని, ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకి తగిన బుద్ధి చెబుతారంటూ వైకాపా అధినేత జ‌గ‌న్ ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు. ఇప్పుడు అదే జ‌రిగి.. నిజంగానే వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైతే.. స్థానిక సంస్థ‌ల్లో టీడీపీ జెండా ఎగ‌ర‌డం క‌ష్ట‌మేన‌ని త‌మ్ముళ్లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారు ప‌రోక్ష ప‌ద్ధ‌తిలో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని బాబుకి సూచిస్తున్నారంట‌. అంతేకాదు, ఈ విష‌యంలో మ‌నం త‌ప్పు చేయ‌డం లేద‌ని, ఈ విధానాన్ని కాంగ్రెస్ ఎప్పుడో అమ‌లు చేసింద‌ని కూడా వారు వివ‌రిస్తున్నార‌ట‌. ఉమ్మ‌డి రాష్ట్రంలో అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వం మేయ‌ర్ - మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వుల‌కు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌లే నిర్వ‌హించింది.

 అయితే, ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం వీటిని ప‌రోక్ష ప‌ద్ధ‌తిలో నిర్వ‌హించింది. ఇప్పుడు ఈ విధానాన్నే అనుస‌రించాల‌ని టీడీపీలోని మెజారిటీ నేత‌లు  భావిస్తున్నార‌ట‌. అంతేకాకుండా ఈ విష‌యంలో వైకాపా అధినేత జ‌గ‌న్ ఏదైనా విమ‌ర్శ‌లు చేసినా.. ఈ ప‌రోక్ష విధానం ఇప్పుడు కొత్త‌గా తాము ప్ర‌వేశ పెట్టింది కాద‌ని, వైఎస్ హ‌యాంలోనే తొలిసారి అమ‌లైంద‌ని ఎదురుదాడి చేసి నోరు మూయించొచ్చ‌ని స‌ల‌హా ఇచ్చార‌ట‌. ఇదే విష‌యాన్ని బాబు వ‌ద్ద ప్ర‌స్తావించార‌ట‌ కూడా.. అయితే, బాబు మాత్రం ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కే వెళ్దాం ప్ర‌జ‌లు మ‌న గురించి ఏమ‌నుకుంటున్నారో కూడా తెలుస్తుంది అన్న‌ట్టు స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ టీడీపీ నేత‌లు మాత్రం ఒప్పుకోలేద‌ట‌. ఈ క్ర‌మంలో విధిలేని ప‌రిస్థితిలో బాబు ప‌రోక్ష ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని డిసైడ్ అయ్యార‌ని తెలిసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News