సా...గుతున్న చంద్రబాబు పదవుల పందేరం!

Update: 2017-11-02 03:30 GMT
ఒక పార్టీ రాజకీయాల్లో విజయం సాధించడం అంటే... దానికోసం తమ శక్తియుక్తులు డబ్బు కూడా ఖర్చుపెట్టి పనిచేసే నాయకులు ఎంతో మంది ఉంటారు. కానీ పదవులు కొందరికి మాత్రమే దక్కుతాయి. ఎందుకంటే.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పోస్టులు కొన్ని మాత్రమే ఉంటాయి. చంద్రబాబు లాంటి వారి పాలనలో అయితే.. ఇతర పార్టీల నుంచి ఫిరాయించి వచ్చిన వారు కూడా చాలా పదవులు గద్దల్లా తన్నుకుపోతారు. మరి ఎంతో కాలంగా పార్టీనే నమ్ముకుని పనిచేస్తూ ఉండే వారి గతి ఏమిటి? వారికి కేవలం నామినేటెడ్ పదవుల మీదనే ఆశ ఉంటుంది. ప్రభుత్వాధినేత దయతలచి నామినేటెడ్ పోస్టులు ఇస్తే.. ఏదో కాస్త హోదాలు వెలగబెట్టాలనే కోరిక ఉంటుంది. నారా చంద్రబాబునాయుడు మాత్రం.. పార్టీ శ్రేణుల ఆశలకు తగినట్లుగా ఈ విషయంలో స్పందించడం లేదనే ఆరోపణలు చాలా కాలంగా వినవస్తున్నాయి.

ఎందుకంటే.. నామినేటెడ్ పోస్టలను ఆయన ఏళ్ల తరబడి ఖాళీగా ఉంచుతున్నారే తప్ప.. వాటిని భర్తీచేసి, నాయకులకు ఏదో ఒకరకమైన అవకాశాలు కల్పించడం లేదనే విమర్శలు ఉన్నాయి. చంద్రబాబునాయుడు పార్టీ కోసం కష్టపడిన వారికి నామమాత్రపు పదవులు ఇవ్వడానికి కూడా ఏళ్లూపూళ్లూ గడిపేయడం వారికి కోపం తెప్పిస్తోంది.

సాధారణంగా నామినేటెడ్ పోస్టుల పదవీకాలం రెండేళ్లు ఉంటుందనుకున్నా.. ఒక ప్రభుత్వ హయాంలో కనీసం మూడు టర్మ్ లుగా ముగ్గురునేతలకు పదవులు కట్టబెట్టవచ్చు. కానీ.. చంద్రబాబు జమానాలో ఒక్క కమిటీ ఏర్పాటు కూడా కష్టమే అన్నట్టుగా తయారవుతోందని విమర్శలు వస్తున్నాయి. పార్టీనుంచి ఎన్నిసార్ల విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ.. చంద్రబాబు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.

నిజానికి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడానికి బాబు ఎంపిక చేసిన నాయకుల పేర్లతో జాబితాలు ఎప్పుడో తయారయ్యాయి. తుదిసారిగా ఓసారి పరిశీలించి జీవోలు ఇచ్చేయడమే తరువాయి. ఒకవైపు ఎన్నికల సంవత్సరం ముంచుకువచ్చేస్తున్నా చంద్రబాబు ఇప్పటికీ ఆ జాబితాల మీద సమీక్ష సమావేశాలు పెడుతున్నాడే తప్ప జీవోలు మాత్రం ఇవ్వడం లేదనే విమర్శలు బహుధా వినిపిస్తున్నాయి. పార్టీ శ్రేణులను సంతృప్తి పరచే ఇలాంటి కీలక నిర్ణయాల విషయంలో జాగు చేయడం పార్టీకి చేటు చేస్తుందని పలువురు తెదేపా నేతలే గుర్రుగా ఉన్నారు.
Tags:    

Similar News