మొక్కల మీద బాబు అన్ని మాటలు చెప్పారు

Update: 2016-07-21 04:50 GMT
ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. అందుకు అనుగుణంగా రాజకీయ నాయకులు ఆ విషయాల గురించి విపరీతంగా మాట్లాడేస్తుంటారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొక్కల ట్రెండ్ నడుస్తోంది. పర్యావరణ సమతౌల్యం.. వానలు కురవాలంటే మొక్కలు పెరగాల్సిందే తరహా చాలా మాటల్ని సీఎమ్మెలే స్వయంగా చెబుతున్న పరిస్థితి. అంతేకాదు.. చెట్ల పెంపకం మీద ప్రత్యేక శ్రద్ధ వహించటమే కాదు.. మొక్కలు పెంచే వారికి సరికొత్త ప్రోత్సాహాకాలు అందించాలని.. మొక్కల్ని పెంచనోళ్ల మీద పరిమితులు విధించాలన్న వరకూ మ్యాటర్ వెళుతోంది.

మొక్కల పెంపకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీరియస్ గా తీసుకోవటం కనిపిస్తోంది. ‘వనం-మనం’ పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కలు పెంచాలంటూ పిలుపునిస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘హరితహారం’ పేరిట భారీ కార్యక్రమాన్నే చేపట్టారు. కార్యక్రమాల వారీగా చూస్తే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్త ముందుగా చేపట్టినట్టు కనిపించినా.. గ్రౌండ్ వర్క్ విషయంలో కేసీఆర్ కే మార్కులు వేయాలి. కోట్లాది మొక్కల్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా రూ.240కోట్లు ఖర్చు చేయటం గమనార్హం. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రెండు గ్రామాల్లో ఒక గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేయించి కోట్లాది మొక్కల్ని నాటేందుకు సిద్ధం చేశారు.

మొక్కలు పెంచే కార్యక్రమాన్ని మొదటే మొదలెట్టిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. తాజాగా కేసీఆర్ మొక్కలు జోరు ఆయనలో ఆసక్తిని మరింత పెంచినట్లుంది. అందుకే.. ఈ నెల 29న ఒకే రోజు కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు మొదలెట్టారు. ఈ సందర్భంగా మొక్కల గురించి ఆయన బోలెడన్ని మాటలు చెప్పుకొచ్చారు. వాటన్నింటిని ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘‘మొక్కలు నాటనోడు మనిషే కాదు’’ అని తేల్చేశారు. అంతా బాగుంది కానీ ఒక్కటే డౌట్.. ఇంతకాలం తర్వాత చంద్రబాబుకు ఈ మాట గుర్తుకు రావటం ఏమిటి? మరిప్పటివరకూ ఆ మాట చెప్పనందుకు ఏమనాలి? ఏమైనా పాలకుడు మనసు పడాలే కానీ.. ఇలాంటి మాటలకు కొదవ ఉండేదేమో..?
Tags:    

Similar News