పోల‌వ‌రంపై బాబు మ‌ళ్లీ మాట మార్చేశాడు!

Update: 2018-06-11 10:22 GMT
పోలవ‌రం... జాతీయ ప్రాజెక్టు హోదా క‌లిగిన ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నిజంగానే ఏపీ స‌శ్య‌శ్యామ‌ల‌మ‌వుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే చెప్పాలి. దాదాపు 7 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పైగా సాగు నీటితో పాటు ప‌లు జిల్లాల‌కు తాగు నీటిని అందించ‌డంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్‌ కు అవ‌స‌ర‌మైన  మేర‌కు నీటిని అందించడం ఈ ప్రాజెక్టు పూర్తి అయితేనే సాధ్య‌మ‌వుతుందన్న‌ది నిపుణుల మాట‌. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి వ‌ర‌ప్ర‌దాయ‌నిగా నిలుస్తుంద‌న్న భావ‌న‌తోనే కేంద్ర ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖ‌ర్చు మొత్తాన్ని భ‌రించేందుకు ఒప్పుకుంది. అంతేకాకుండా ప్రాజెక్టును తామే నిర్మించి ఇస్తామ‌ని కూడా కేంద్రం చెప్పింది. అయితే సొంత మ‌నుషుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... నిధులిస్తే చాలు - ప్రాజెక్టును మేమే క‌ట్టుకుంటామంటూ ఓ వితండ‌వాద‌న చేశారు. నాడు బీజేపీతో పొత్తు కార‌ణంగా కేంద్రం నుంచి కూడా త‌న‌కు అనుకూలంగానే నిర్ణ‌యం వ‌చ్చేలా చేసుకున్నారు. మొత్తంగా కేంద్రం ఇచ్చే నిధుల‌తో త‌న మ‌నుషుల‌తో ప‌నులు చేసుకుంటూ బాబు బాగానే మేనేజ్ చేసుకుంటూ వ‌స్తున్నారు.

ఈ క్ర‌మంలో ప్ర‌తి సొమ‌వారం పోలవ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తానని - 2018 చివ‌రి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి తీర‌తాన‌ని కూడా కాస్తంత ఘ‌నంగానే ప్ర‌క‌టించారు. తొలుత 2018 ప్ర‌థ‌మార్థం నాటికే అని చెప్పిన బాబు... ఈ ప్ర‌క‌ట‌న‌లో ప‌లు మార్లు మార్పులు చేసి చివ‌ర‌కు 2018 చివ‌రి నాటిక‌ని మొన్న‌టిదాకా చెప్పుకుంటూ వ‌చ్చారు. తీరా 2018 ప్రథ‌మార్ధం పూర్త‌య్యే నాటికే ఆ మాట‌ను కూడా గ‌ట్టున పెట్టేసిన బాబు... అస‌లు త‌న ఐదేళ్ల టెర్మ్‌ లో పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేయ‌లేన‌ని స్వ‌యంగా ప్ర‌క‌టించుకున్నారు. కాసేప‌టి క్రితం పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు నిజంగానే రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు షాక్‌ కు గురి చేశాయి. టీడీపీ సింప‌థైజ‌ర్స్‌కు ఈ మాట‌లు షాక్ త‌గిలినా... బాబు నిజ‌నైజాన్ని గుర్తించిన జ‌నం మాత్రం ఇప్ప‌టికైనా బాబు త‌న చేత‌కాని త‌నాన్ని ఒప్పేసుకున్నార‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. అయినా పోల‌వ‌రంపై బాబు తాజా ప్ర‌క‌ట‌న ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... పోలవరం పూర్తయ్యే వరకూ తనకు సోమవారం పోలవారమేనని - 2019 డిసెంబర్ నాటికి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని - ఎన్ని అడ్డంకులు పెట్టినా 2019 డిసెంబ‌ర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు ప్ర‌క‌టించారు.

అయినా 2019 డిసెంబ‌ర్ నాటికి చంద్ర‌బాబు సీఎంగా ఉంటారా? అంటే... లేద‌నే చెప్పాలి. ఎందుకంటే... ప్ర‌స్తుత ఐదేళ్ల టెర్మ్ వ‌చ్చే ఏడాది మేతో ముగియ‌నుంది. వ‌చ్చే ఏడాది జ‌రిగే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ టీడీపీ గెలిస్తేనే... చంద్ర‌బాబు సీఎం అవుతారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సీఎం కావ‌డం దాదాపుగా స‌త్య‌దూర‌మ‌ని చాలా స‌ర్వేలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పోల‌వ‌రం గ‌డువును 2019 డిసెంబ‌ర్ నాటికి పెంచ‌డం ద్వారా... పోల‌వ‌రం పూర్తి కావాలంటే మ‌రోమారు త‌న‌కు ఓటేయాల‌ని ప్ర‌జ‌ల‌ను బాబు మ‌భ్య‌పెట్టేందుకు ప‌క్కాగానే ప్లానింగ్ చేసుకుంటున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే...పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేయ‌డం చంద్ర‌బాబుకు ఈ ఐదేళ్ల టెర్మ్‌ లో సాధ్యం కాద‌ని టీడీపీ నేత‌ - అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఎప్పుడో సెల‌విచ్చేసిన సంగ‌తి తెలిసిందే. జేసీ మాట నిజ‌మేన‌న్న‌ట్లుగా ఇప్పుడు చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న నిజంగానే ఆశ్చ‌ర్యం రేకెత్తిస్తోంది. అంతేకాకుండా పోల‌వ‌రం ప్రాజెక్టును త‌న ఐదేళ్ల కాలంలో పూర్తి చేయ‌డం త‌న వ‌ల్ల కాద‌ని చంద్ర‌బాబే స్వ‌యంగా ఒప్పేసుకున్న‌ట్లేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News