కేసీఆర్‌ దీక్ష చేస్తే.. మరి బాబు..?

Update: 2015-06-23 13:30 GMT
అంశాల వారీగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య లల్లి అందరికి తెలిసిన విషయమే. ఇప్పటివరకూ ఏర్పడిన పంచాయితీలకు.. ఇప్పుడు తాజాగా మొదలైన సెక్షన్‌ 8 పంచాయితీకి చాలానే తేడా ఉందని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. మిగిలిన విషయాల్లో సాంకేతిక అంశాలు చాలా ఎక్కువని.. కానీ.. సెక్షన్‌ 8 విషయం అలా కాదని.. అందులో సంక్లిష్టత తక్కువని చెబుతున్నారు.

శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్‌ నిర్దేశించవచ్చని సెక్షన్‌ 8లో చెప్పారే కానీ.. శాంతిభద్రతలు చేజారినప్పుడు అన్న పదం లేదు. దీంతో.. సెక్షన్‌ 8 అమలు చేయాలంటే శాంతిభద్రతలు చేజారిపోయినప్పుడే అంటూ తెలంగాణ రాష్ట్ర సర్కారు చేస్తున్న వాదనలో పస ఉండదని చెబుతున్నారు. ఒకవేళ ఇదే విషయాన్ని మరింత బలంగా చెబితే.. గతంలో జరిగిన అంశాల్ని ఏపీ నాయకులు బయటకు తీస్తారని చెబుతున్నారు.

హైకోర్టు విభజన చేయాలంటూ తెలంగాణ న్యాయవాదులు.. ఏపీ ప్రాంతానికి చెందిన న్యాయమూర్తిపై కోడిగుడ్లతో దాడి చేయటం తెలిసిందే. దీనికి సంబంధించిన పోలీసు కేసు నమోదైంది. ఇలాంటి అంశాలు పలు చోటు చేసుకున్నాయని.. అలాంటి వాటినన్నింటిని బయటకు తీసి హైదరాబాద్‌లో శాంతిభద్రతల మీద క్వశ్చన్‌ మార్క్‌ వచ్చేలా ఏపీ సర్కారు చేస్తుందన్న భావన వ్యక్తమవుతోంది.

హైదరాబాద్‌లో సెక్షన్‌ 8ని అమలు చేసిన పక్షంలో తాము తీవ్రంగా వ్యతిరేకించాలని.. అవసరమైతే దీక్ష కూడా చేయాలని తెలంగాణ అధికారపక్షం ఇప్పటికే వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. నిన్నమొన్నటివరకూ ఇలాంటి అంశాల విషయాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంత దూకుడుగా ఉండేవారుకాదు. తెలంగాణలో పార్టీ ప్రయోజనాలు అంటూ కాస్త వెనుకా ముందు ఆడేవారు. కానీ.. ఇప్పుడాయనకు ఏపీలో తమ పార్టీని రక్షించుకోవటం మీద దృష్టి పెట్టాలన్న విషయాన్ని గర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను తెరపైకి తీసుకొచ్చిన సెక్షన్‌ 8 విషయంలో ఏ మాత్రం రాజీ పడినా ఉభయ భ్రష్టుత్వం పట్టటం ఖాయమన్న విషయం చంద్రబాబుకు తెలియంది కాదు.

ఈ నేపథ్యంలో..సెక్షన్‌ 8ని విధిస్తే తాము దీక్ష చేసేందుకు వెనుకాడమని.. ఉద్యమం చేస్తామని తెలంగాణ అధికారపక్షం హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్‌ కో నుంచి అలాంటి స్పందనే వస్తుందన్న వాదన వ్యక్తమవుతోంది. అదే జరిగితే.. రెండు రాష్ట్రాల మధ్య మరింత దూరం పెరగటం ఖాయమన్న పరిస్థితి.



Tags:    

Similar News