ఆర్కే బీచ్ లో రౌడీయిజాన్ని స‌హించేది లేద‌న్న బాబు

Update: 2017-01-27 05:23 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరుతూ ఆర్కే బీచ్‌లో త‌ల‌పెట్టిన కొవ్వొత్తుల ర్యాలీ పోలీసుల ఆంక్ష‌ల నేప‌థ్యంలో విఫ‌లం అయిన అనంత‌రం గురువారం రాత్రి ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. రిపబ్లిక్ డే రోజున దేశభక్తి గురించి మాట్లాడుకోవాల్సి ఉండ‌గా  రాజకీయాలు చేయడం తగదని అన్నారు. కేంద్ర ప్రత్యేక హోదా ఇవ్వనని స్ప‌ష్టం చేసిన నేపథ్యంలోనే తనకు అవగాహన ఉంది కాబట్టి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నానని చంద్ర‌బాబు తెలిపారు. ప్ర‌క‌టించిన ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ద‌త కోరుతున్నాన‌ని వివ‌రించారు. అయిన‌ప్ప‌టికీ నిర‌స‌న‌ల పేరుతో రోడ్డెక్కార‌ని బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశ‌వ్యాప్తంగా రెడ్ అల‌ర్ట్ ఉన్న స‌మ‌యంలో నిర‌స‌న‌ల‌కు దిగుతానంటే ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.బీచ్ రోడ్డులో కూర్చొని రౌడీయిజం చేస్తానంటే కుదరదని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

విశాఖ అభివృద్ధికి ఎంత‌గానో కృషి చేశానని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు వివ‌రించారు. హుదూద్ వంటి ప్ర‌కృతి విప‌త్తు వ‌చ్చిన‌పుడు క్షేత్ర‌స్థాయిలోనే ఉండి ప‌నులు ప‌ర్య‌వేక్షించాన‌ని గుర్తు చేశారు. భాగ‌స్వామ్య స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ ద్వారా గ‌త ఏడాది విశాఖ స‌త్తాను ప్ర‌పంచానికి చాటిచెప్పాన‌ని వివ‌రించారు. తాజాగా మ‌రో స‌మావేశంతో రూ.2.82 లక్షల కొత్త పెట్టుబడులను ఆక‌ర్షించి త‌ద్వారా 9 లక్షల ఉద్యోగాల‌ను క‌ల్పించేందుకు కృషి చేస్తుంటే ఇలాంటి ప‌రిణామాలు జ‌రుగుతున్నాయ‌ని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విపక్షాల నిరసనలు పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయ‌ని బాబు వ్యాఖ్యానించారు. దేశంలోనే ఎక్కడా జరగని అభివృద్ధి ఏపీలో జరిగిందని అయిన‌ప్ప‌టికీ ఏపీలోని విపక్షాలు వీటిని అర్థం చేసుకోలేక‌పోతున్నాయ‌ని మండిప‌డ్డారు. రాజకీయాలతో ప్ర‌జా జీవితంలో వెలుగులు నింపాల్సి ఉండ‌గా కొంద‌రు దురుద్దేశాల‌కు రాజకీయాల‌ను వాడుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తంలో ఇలా చేసి త‌మ‌కు వంత పాడాల‌ని కొందరు పారిశ్రామిక వేత్తలను పెద్ద ఎత్తున ఒత్తిడి చేయ‌డంతో వారు త‌లొగ్గ‌డం వ‌ల్ల త‌ద‌నంత‌ర కాలంలో అక్రమాలకు పాల్పడి జైళ్లకు వెళ్లారని చంద్ర‌బాబు గుర్తు చేశారు. తాము ఆ విధంగా వ్య‌వ‌హ‌రించడం లేద‌ని నిజాయితీగా అభివృద్ధి, పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తూ ముందుకు సాగుతున్నామ‌ని వివ‌రించారు. రాష్ట్రంలో రాజ‌కీయ పార్టీల‌కు మీడియా ఉండ‌వ‌ద్ద‌ని చంద్ర‌బాబు అన్నారు. ఇలా ఉండ‌టం వ‌ల్ల రెచ్చ‌గొట్టే కార్య‌క్ర‌మాలు ఎక్కువ‌గా జ‌రుగుతుంటాయ‌ని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్ర‌భుత్వంతో క‌లిసి ముందుకు సాగుతున్నామ‌ని, ఏపీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి దేశంలోనే నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిల‌ప‌డం త‌న ధ్యేయ‌మ‌ని చంద్ర‌బాబు అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News