ఈ అప‘ఖ్యాతి’ ఎవరి‘ఖాతాలో వేస్తావు బాబు

Update: 2016-07-03 04:46 GMT
తన గురించి.. తన ప్రభుత్వం గురించి నిత్యం గొప్పలు చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్నబోయేలా.. ఆయన పరపతిని దెబ్బ తీసే జాతీయ సర్వే ఒకటి బయటకు వచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని స్థితిగతులు.. అవినీతికి ఎంతమోతాదులో ఉంది లాంటి అంశాలపై దృష్టి పెట్టి.. అధ్యయనం చేసే నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ సంస్థ తాజాగా ఒక సర్వేను విడుదల చేసింది.

దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రాలు ఏమిటన్న అంశంపై అధ్యయనం చేయటంతో పాటు.. సర్వేను నిర్వహించింది. ఇందులో ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. దేశంలోని 29 రాష్ట్రాల్లో అత్యంత అవినీతి రాష్ట్రంగా ఏపీ స్టేట్ అపఖ్యాతి మూటగట్టుకుంది. ఏపీలో అవినీతి భారీగా ఉందని 74.3 శాతం మంది అభిప్రాయపడటం బాబు సర్కారు తీరుపై ప్రజల్లో ఉన్న భావనను చెప్పకనే చెప్పేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రాజెక్టు రీడిజైన్ల విషయంలో భారీ అవినీతి పాల్పడినట్లుగా విపక్షాలు ఆరోపణలు చేస్తున్న మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ అవినీతి విషయంలో చాలా తక్కువగా ఉందంటూ సర్వే ఫలితం స్పష్టం చేయటం గమనార్హం.

ఐదు అంశాల (కార్మికులు - మౌలిక వసతులు - రాజకీయ సుస్థిరత - పపరిపాలన - ఆర్థిక పరిస్థితి) ఆధారంగా అధ్యయనంతో పాటు.. సర్వే నిర్వహించారు. దీని ప్రకారం దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవగా రెండోస్థానంలో తమిళనాడు నిలవటం గమనార్హం. ఏపీలో అవినీతి తీవ్ర సమస్య అని 74.3 శాతం మంది అభిప్రాయపడితే.. 17.1 శాతం మంది మాత్రం అవినీతి ఒక మోస్తరుగా ఉందని వ్యాఖ్యానించారు. కేవలం 8.6 శాతం మంది మాత్రమే అవినీతి అన్నది సమస్యగా లేదని చెప్పటం గమనార్హం.

ఇక.. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే అవినీతి అతి పెద్ద సమస్య అని చెప్పిన వారు 26.5 శాతం మంది మాత్రమే చెప్పగా.. అవినీతి ఒక మోస్తరుగా ఉందని 61.8 మంది అభిప్రాయపడ్డారు. ఇక.. అవినీతి అన్నది అసలు జరగలేదని 11.8 శాతంమంది చెప్పటం విశేషం. ఇదిలా ఉంటే.. హిమాచల్ ప్రదేశ్ లో అవినీతి సమస్య తీవ్రంగా ఉందని ఒక్కరు కూడా వెల్లడించకపోవటం ఒక ఎత్తు అయితే.. 55 శాతం మంది ఆ రాష్ట్రంలో అవినీతి అన్నదే లేదని చెప్పగా.. 45 శాతం మంది మాత్రం ఓ మోస్తరుగా ఉందని వెల్లడించారు. విపక్షంలో ఉన్నప్పుడు నిత్యం అవినీతి గురించి మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రం అవినీతిలోనే నెంబర్ వన్ గా నిలవటం ఆయన ఇమేజ్ ను భారీగా దెబ్బ తీస్తుందని చెప్పాలి. నిత్యం తన గొప్పతనాన్ని చెప్పుకునే చంద్రబాబు.. తాజాగా వెల్లడైన సర్వేను తన ఫెయిల్యూర్ కు నిదర్శనంగా చెప్పాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News