మూడున్న‌రేళ్ల త‌ర్వాత ఆ హామీపై బాబు క‌సర‌త్తు

Update: 2017-08-05 05:56 GMT
2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ అధినేత‌ - నారా చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన కీల‌క హామీల్లో ముఖ్య‌మైన‌ది, ఆ మాట‌కొస్తే అధికారంలోకి వ‌చ్చేందుకు దోహద‌ప‌డింది నిరుద్యోగ భృతి హామీ. త‌న‌దైన శైలిలో ఈ హామీ లాభాల‌ను వివ‌రించిన చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దాన్ని అట‌క ఎక్కించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే తాజాగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఈ విష‌యంలో ముంద‌డుగు వేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న వారికి నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఎన్నిక‌ల హామీని మూడేండ్ల త‌ర్వాత నెర‌వేర్చేందుకు నిర్ణ‌యం తీసుకున్న సీఎం నంద్యాల ఉప ఎన్నిక స‌మ‌యంలోనే ఈ మేర‌కు అడుగువేయ‌డ‌మే ఆసక్తిక‌రంగా మారింది.

కీల‌క హామీలు నెర‌వేర్చ‌డం లేద‌ని, అందులోనూ యువ‌త ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ భృతి విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం దాట‌వేత దోర‌ణి స‌రికాద‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి కొద్దికాలం క్రితం ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు లేఖ రాసిన తెలిసిందే. దీనికి స్పందించిన తెలుగుదేశం వ‌ర్గాలు నిరుద్యోగ భృతి హామీని నిలుపుకునేందుకు ముందుకు సాగుతున్న‌ట్లు తెలిపాయి. అనంత‌రం ప్ర‌భుత్వ పరంగా ప్ర‌క్రియ కూడా ప్రారంభ‌మ‌యింది. కేబినెట్‌ లో చ‌ర్చించ‌డం, ప‌లు రూపాల్లో స‌మాచార సేక‌ర‌ణ వంటి ప్ర‌క్రియ‌లు పూర్తి చేసుకొని నిరుధ్యోగ భృతికి మోక్షం ద‌క్కింది. మొత్తంగా ఈనెల 15 ప్ర‌క‌ట‌న ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు నిరుద్యోగ భృతిపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం దీనిపై కొన్ని ప్రతిపాదనలను సీఎంకు అందించింది. 18 నుంచి 35 సంవత్సరాల వయసులోపు వారికే ఈ నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అధికారులు నిరుద్యోగ భృతిపై కీలక ప్రతిపాదనలు చేసి సీఎం కార్యాలయానికి సమర్పించారు. అధికారులు చేసిన ఈ ప్రతిపాదనల్లో రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు లెక్క తేల్చారు. వీరంతా ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమో దు చేసుకున్నవారు మాత్రమే. వీరికి మాత్రమే భృతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేయిం చుకోని వారి సంఖ్య కూడా లక్షల్లోనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ కన్నా తక్కువ చదివిన వారికి నెలకు రూ.900, గ్రాడ్యు యేట్లకు నెలకు రూ.1500, పోస్టు గ్రాడ్యుయేట్లకు తదితర విద్యాభ్యాసం చేసిన వారికి నెలకు రూ.3 వేలు చొప్పున భృతిగా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో కుటుంబం నుండి ఒకరికి మాత్రమే భృతి ఇవ్వాలని, అది కూడా దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలని అధికారులు ప్రతిపాదన చేశారు. విద్య పూర్తి చేసుకుని, ఉద్యోగం కోసం వేచి చూస్తున్నవారే తప్ప ఇంకా చదువుకుంటున్న వారిని అనర్హులుగా పరిగణిస్తారు. ప్రైవేటు ఉద్యోగాలు, స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా అనర్హులే అని గైడ్‌ లైన్స్‌ సిద్ధం చేస్తున్నారు.
Tags:    

Similar News