ఏపీలో ముందస్తు ఎన్నికలు? బాబు వ్యాఖ్య

Update: 2017-04-21 09:22 GMT
రాజకీయ విశ్లేషకులు, వివిధ పార్టీల నేతలు ఊహిస్తున్నదే జరగబోతోందా... ? ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం 2019 వరకు ఆగకుండా ముందస్తు ఎన్నికలు వెళ్లనుందా? అంటే అవుననే అనిపిస్తున్నాయి తాజా పరిస్థితులు. కీలక నేతల వ్యాఖ్యలూ అదే దిశగా ఉంటున్నాయి. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అదే మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు.
    
ఈ రోజు ఉదయం ఆయన అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగగా, వైకాపా నుంచి వచ్చిన నేతలతో కలసి పనిచేయాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ భావిస్తోందని గుర్తు చేసిన ఆయన, అందులో భాగంగా ఏపీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని తెలిపారు. పార్టీలోని నేతలందరూ కలసికట్టుగా సాగితే మరోసారి విజయం ఖాయమని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
    
కాగా సెంట్రల్ లోని బీజేపీ ప్రభుత్వం మొన్నటి అయిదు రాష్ర్టాల ఎన్నికల్లో నాలుగు స్టేట్లలో అధికారంలోకి వచ్చింది. దీంతో మోడీ నాయకత్వంపై మంచి క్రేజి ఉందని.. ఈ వేడి ఉన్నప్పుడే మరోసారి అధికారంలోకి రావాలని ప్లాను వేస్తోంది. ముఖ్యంగా సౌత్ లో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. ఏపీలో మిత్రపక్షం టీడీపీ అధికారంలో ఉండడంతో ఇక్కడ సొంతంగా అధికారం చేపట్టాలని 2019కి లక్ష్యం పెట్టుకోనప్పటికీ మిత్రపక్షంతో కలిపి అయినా ఇక్కడ అధికారంలో ఉండాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ముందస్తు ఎన్నికలకు వస్తే ఏపీలోనూ అదే సమయంలో నిర్వహించాలని బీజేపీ కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా చంద్రబాబు మాటలు కూడా అదే ఉద్దేశాన్ని చాటాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News