కూటమిలో 'క్రెడిట్' లెక్క‌లు... ఈ ట్విస్టులు తెలుసా.. !

తాజాగా కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన ఆరు మాసాల్లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి పంచాయ‌తీరాజ్ వ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేసేందుకు న‌డుం బిగించారు.

Update: 2025-01-23 21:30 GMT

కూట‌మి ప్ర‌భుత్వంలో తీసుకుంటున్న నిర్ణ‌యాల్లో మెజారిటీ నిర్ణ‌యాలు.. వాటి ద్వారా ద‌క్కుతున్న క్రెడిట్ వంటివి పార్టీ నేత‌ల మ‌ధ్య లెక్క‌ల‌కు వ‌స్తున్నాయి. చాలా వ‌ర‌కు నిర్ణ‌యాల్లో జ‌న‌సేన‌-టీడీపీ దూకుడుగా ఉన్నాయి. అంతేకాదు.. మెజారిటీ నిర్ణ‌యాల్లో క్రెడిట్‌ సీఎం చంద్ర‌బాబుకే ద‌క్కుతోంద‌న్న వాద‌న కూడా ఉంది. అయితే.. మ‌రికొన్ని మాత్రం జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఖాతాలో ప‌డుతున్నాయి. వీటిపై ఇటు టీడీపీ నాయ‌కులు, అటు జ‌న‌సేన నాయ‌కులు కూడా లెక్క‌లు వేసుకుంటున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు గ్రామీణ స్థాయిలో ర‌హ‌దారు ల బాగు చేత, కొత్త‌వాటి నిర్మాణం విష‌యంలో 2 వేల కోట్ల‌ను కేటాయించి అప్ప‌టిక‌ప్పుడు నిర్ణ‌యం తీసు కున్నారు. దీనిలో మెజారిటీ పాత్ర ప‌వ‌న్‌దే ఉంది. అయితే.. చంద్ర‌బాబు కూడా జోక్యం చేసుకున్నారు. దీంతో ఇద్ద‌రికీ క్రెడిట్ ద‌క్కింది. ఇక‌, విజ‌య‌వాడ వ‌ర‌ద‌లు, ఏలూరులో ఎర్ర‌కాలువ‌కు వ‌చ్చిన వ‌ర‌ద విష‌యాల్లో పూర్తి క్రెడిట్‌ను చంద్ర‌బాబు సొంతం చేసుకున్నారు. ఇదేస‌మ‌యంలో తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం వ‌చ్చిన‌ప్పుడు కూడా ఇటు చంద్ర‌బాబు మీడియా ముందు కీల‌క వ్యాఖ్య‌లు చేసి భ‌క్తుల మ‌న‌సు దోచుకున్నారు.

ల‌డ్డూ నాణ్య‌త‌ను పెంచుతామ‌న్నారు. అదే విధంగా ల‌డ్డూ నాణ్య‌త కోసం నాణ్య‌మైన నెయ్యిని వినియోగి స్తామ‌ని కూడా చెప్పుకొచ్చారు. అనంత‌రం.. ప‌వ‌న్ క‌ల్యాణ్ నేరుగా స‌నాత‌న ధ‌ర్మ దీక్ష చేసి.. త‌న క్రెడిట్ ను తాను కాపాడుకున్నార‌ని జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక‌, ఇప్పుడు తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ వ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేస్తున్నారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. ఇది వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌భుత్వ హ‌యాం నుంచి ఉన్న డిమాండే. కానీ, ఎవ‌రూ చేయ‌లేక పోయారు.

దీనిలో కొంత మేర‌కు క్రెడిట్ కొట్టేసేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నించి.. సచివాల‌య వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చారు. కానీ, ఇది ఆయ‌న‌కు రివ‌ర్స్ అయింది. తాజాగా కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన ఆరు మాసాల్లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి పంచాయ‌తీరాజ్ వ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేసేందుకు న‌డుం బిగించారు. దీనిలో భాగంగానే.. తాజాగా ఆయా ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌కు కూడా వివ‌రాలు చెప్ప‌డంతో వారు కూడా ఏక‌గ్రీవంగా ఆమోదించారు.

ఇది పూర్తిగా ప‌వ‌న్‌కే ద‌క్కుతుంద‌ని జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. దీనిలోనూ సీఎం చంద్ర‌బాబుకు భాగ‌స్వామ్యం ఉంద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. ఇక‌, ఈ క్రెడిట్ లెక్క‌ల్లో మ‌రో కూట‌మి పార్టీ బీజేపీ క‌డు దూరంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News