ఢిల్లీలో మోడీపై ఫైట్ అయిపోయిందా బాబు?

Update: 2018-04-10 04:19 GMT
ఏపీ హోదా సాధ‌న వ‌ర‌కూ వెన‌క్కి త‌గ్గేది లేద‌ని.. ఏం చేసేందుకైనా సిద్ధ‌మంటూ భారీ మాట‌లు చెప్పే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌రోసారి వెన‌క్కి త‌గ్గారు. ఢిల్లీలో ఉన్న త‌న పార్టీ ఎంపీల్ని అమ‌రావ‌తికి వ‌చ్చేయాల‌న్నారు. ఓప‌క్క హోదా ఉద్య‌మాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అంత‌కంత‌కూ ఉధృతం చేస్తుంటే.. బాబు మాత్రం అందుకు భిన్నంగా త‌న ఎంపీల్ని ఢిల్లీ నుంచి వ‌చ్చేయాల‌ని కోర‌టం గ‌మ‌నార్హం.

హోదా సాధ‌న‌లో భాగంగా.. ప్ర‌ధాని మోడీపై ఒత్తిడిని తీవ్ర‌త‌రం చేసేందుకు వీలుగా ఇప్ప‌టికే త‌మ పార్టీ ఎంపీల‌తో రాజీనామా చేయించ‌టంతో పాటు.. ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌ను జ‌గ‌న్ చేయిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనికి భిన్నంగా చంద్ర‌బాబు వైఖ‌రి ఉంది.ఎంపీల రాజీనామా చేయించే విష‌యంలో మాట మాట్లాడ‌టానికి కూడా ఇష్ట‌ప‌డటం లేదు. ఎంపీల చేత రాజీనామా చేయించొచ్చు క‌దా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇవ్వ‌టం లేదు. ఎందుకు త‌మ ఎంపీల చేత రాజీనామా చేయించ‌టం లేద‌న్న విష‌యాన్ని క‌న్వీన్సింగ్ గా చెబుతున్న‌ది లేదు.

వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల దీక్ష నేప‌థ్యంలో కాస్త హ‌డావుడి చేయాల‌న్న ఉద్దేశంతో ప్ర‌ధాని మోడీ నివాసం ఎదుట నిర‌స‌న పేరుతో కాసేపు గ‌లాభా చేయ‌టం.. పోలీసులు అదుపులోకి తీసుకున్న త‌ర్వాత ఎంత అన్యాయం జ‌రిగిందో చూశారా? అంటూ గుండెలు బాదుకోవ‌టం చేశాంరు.

తాజాగా ఢిల్లీలో ఉన్న ఎంపీల చేత మ‌రే కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌న్న అంశంపై క్లారిటీ లేని చంద్ర‌బాబు.. వారిని అమ‌రావ‌తికి వ‌చ్చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. స‌చివాల‌యంలోని పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో పాటు.. ఢిల్లీలోని పార్టీ ఎంపీల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ లో ఈ విష‌యంపై సుదీర్ఘంగా చ‌ర్చించిన ఆయ‌న‌.. చివ‌ర‌కు ఎంపీలు రాష్ట్రానికి వెన‌క్కి రావాల‌న్న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు.

హోదా సాధ‌న కోసం త‌మ ఎంపీలు తెగ ప్ర‌య‌త్నం చేశార‌ని.. ప్ర‌ధాని నివాసం ఎదుట నిర‌స‌న చేసేందుకు సైతం వెనుకాడ‌లేదంటూ గొప్ప‌లు చెప్పుకుంటున్న బాబు.. ఎంపీల చేత రాష్ట్ర వ్యాప్తంగా బ‌స్సు యాత్ర చేప‌ట్టాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను త్వ‌ర‌లోనే ఖ‌రారు చేయ‌నున్నారు. ఎందుకిలా అంటే.. హోదా సాధ‌న‌కు సంబంధించి ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో దానికి ప్ర‌తిగా బాబు ఎంపీల్ని వెన‌క్కి వ‌చ్చేయాల‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. చూస్తుంటే.. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌ల్ని చూసి కాపీ కొట్ట‌ట‌మే కానీ.. బాబుకు సొంతంగా హోదా సాధ‌నకు ఏం చేయాల‌న్న అంశంపై క్లారిటీ లేదా? అన్న సందేహం తాజా ప‌రిణామాల్ని చూసిన‌ప్పుడు క‌ల‌గ‌క‌మాన‌దు.
Tags:    

Similar News