అంతా ప్ర‌తికూల‌మే!..బాబెలా గ‌ట్టెక్కుతారో?

Update: 2018-04-13 17:04 GMT
టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ప‌రిస్థితిపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో రాష్ట్ర విభ‌జ‌న‌, ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న నవ్యాంధ్ర‌, క‌నీసం రాజ‌ధాని కూడా లేని వైనం త‌దిత‌ర అంశాలు బాబును ఎలాగోలా గ‌ట్టెక్కించిన వైనంపై ఇప్ప‌టికే లెక్క‌లేన‌న్ని క‌థ‌నాలు వినిపించాయి. ఈ స‌మ‌స్య‌ల‌తో పాటు కేంద్రంలో నాడు బాగా వీచిన న‌రేంద్ర మోదీ గాలి, ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారంతో క‌లిసి  వ‌చ్చిన కాపుల ఓట్లు కూడా బాబును గట్టెక్కించాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే బాబుతో నాడు క‌లిసి న‌డిచిన బీజేపీ గానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ గానీ ఇప్పుడు ఆయ‌న‌తో క‌లిసి న‌డిచే ప‌రిస్థితి లేదు. బీజేపీ ప‌రిస్థితే తీసుకుంటే... రాజ‌కీయంగా అప్ప‌టికే బాబుకు ఉన్న ప్ర‌త్య‌ర్థుల కంటే కూడా ఇప్పుడు బీజేపీనే పెద్ద శత్రువుగా మారిపోయింది. అదే స‌మ‌యంలో కీల‌క త‌రుణంలో ఆప‌ద్బంధ‌వుడిగా ప‌రిణ‌మించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఇప్పుడు బాబును ఏకంగా అవినీతి విష‌యంలో దోషిగా నిల‌బెట్టేశారు. ఈ ప‌రిస్థితి ఇప్పుడిప్పుడే మొద‌లైనా... స‌మీప భ‌విష్య‌త్తులో అటు బీజేపీ గానీ, ఇటు ప‌వ‌న్ క‌ల్యాణ్ గానీ బాబుతో జత‌క‌లిసే అవ‌కాశాలే క‌నిపించ‌డం లేదు.

మ‌రి ఇలాంటి త‌రుణంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబు ఎలా గ‌ట్టెక్కుతారు? అస‌లు బాబుకు గౌర‌వ ప్ర‌ద‌మైన స్థాయిలో అయినా ఓట్లు ద‌క్కుతాయా? అన్న వాద‌న కూడా ఇప్పుడు వినిపిస్తోంది. మొత్తంగా బాబు ప‌రిస్థితీ  ఇప్పుడు పెనంలో నుంచి తీసి పొయ్యిలో ప‌డిన చందంగా మారింద‌న్న దిశ‌గా పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంద‌న్న విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. అయినా బాబుకు ఈ త‌ర‌హా ప‌రిస్థితి ఎదురు కావ‌డానికి వేరేవ‌రో కార‌ణం కాద‌ని, బాబే స్వ‌త‌హాగా త‌న‌ను తాను ఈ వింత ప‌రిస్థితిలోకి నెట్టేసుకున్నార‌న్న వాదన కూడా లేక‌పోలేదు. మొత్తంగా ఇప్పుడు బాబు ప‌రిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింద‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఈ ప‌రిస్థితి ఉత్ప‌న్నం వెనుక వ‌రుస‌గా చోటుచేసుకున్న కార‌ణాల‌ను ప‌రిశీలిస్తే... ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరే ప్ర‌ధాన‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తీవ్ర ఆర్థిక లోటుతో ఏర్ప‌డ్డ నవ్యాంధ్ర‌కు ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టిస్తామ‌ని నాడు పార్ల‌మెంటు సాక్షిగా అప్ప‌టి ప్ర‌ధాని హోదాలో మ‌న్మోహ‌న్ సింగ్ హామీ ఇచ్చారు. అయితే ఆ అంశాన్ని విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొనలేద‌న్న ఒకే ఒక్క కార‌ణాన్ని చూపిన బీజేపీ స‌ర్కారు... చంద్ర‌బాబుకు కూడా త‌న మ‌న‌సులోని మాట‌ను నేరుగానే చెప్పిన‌ట్టు వార్త‌లు వినిపించాయి. చ‌ట్టం విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టేసి... 14వ ఆర్థిక సంఘం నిబంధ‌న‌ల మేర‌కు ప్ర‌త్యేక హోదా సాధ్యం కాద‌ని, ప్ర‌త్యేక ప్యాకేజీ అయితే ప‌రిశీలిస్తామ‌న్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మాట‌కు లొంగిపోయిన చంద్ర‌బాబు....గ‌డ‌చిన నాలుగేళ్లుగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతూనే వ‌చ్చారు. అయితే మొన్న‌టి మోదీ స‌ర్కారు చిట్టచివ‌రి బ‌డ్జెట్ లో మోదీ స‌ర్కారు ఏపీకి పూర్తిగా అన్యాయం చేసేలా వ్య‌వహ‌రించ‌డంతో బాబు స్పందించ‌క త‌ప్ప‌లేదు. అప్ప‌టిదాకా త‌న నోటితోనే వ‌ద్ద‌న్న ప్ర‌త్యేక హోదాను ఇప్పుడు భుజానికెత్తుకున్న బాబుకు జ‌నం నుంచి కూడా పెద్ద‌గా మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేదన్న వాద‌న వినిపిస్తోంది.

అదే స‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆది నుంచి ఒక‌టే స్టాండ్ తో ముందుకు సాగిన విప‌క్ష వైసీపీ ఎప్ప‌టిక‌ప్పుడు బాబుకు దెబ్బ‌లు వేస్తూనే ఉంది. ఇప్పుడు ఏకంగా మోదీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌డం, త‌న ఎంపీల‌తో రాజీనామాలు చేయించిన వైనం బాబును మ‌రింత‌గా ఇబ్బందిక‌రమైన ప‌రిస్థితిలోకి నెట్టేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. పార్ల‌మెంటులో టీడీపీ ఎంపీలు వ‌రుస నిర‌స‌న‌ల‌తో హోరెత్తించిన‌ట్టు క‌ల‌రింగ్ ఇచ్చినా... పార్ల‌మెంటు స‌మావేశాలు ముగియ‌గానే బ‌స్సు యాత్ర‌కు బాబు రెడీ చేయ‌గా... అందుకు టీడీపీ ఎంపీలంతా స‌సేమిరా అన‌డం కూడా హోదా ఉద్య‌మంలో బాబు విశ్వ‌స‌నీయ‌త‌పై భారీ దెబ్బే ప‌డింద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మొత్తంగా ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం చంద్ర‌బాబును ప్ర‌జా కోర్టులో దోషిగా నిలిపేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదిలా ఉంటే... 2019 ఎన్నిక‌ల‌కు ఇంకా సరిగ్గా ఏడాది మాత్ర‌మే స‌మ‌యం ఉంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో రాజ‌ధాని నిర్మాణాన్ని పూర్తి చేయ‌డంతో పాటుగా పోల‌వ‌రం ప్రాజెక్టును కూడా పూర్తి చేసిన త‌ర్వాతే ఓట్ల‌డుగుతామ‌ని చెప్పిన బాబు... ఆ రెండింటిలో ఏమాత్రం పురోగ‌తి సాధించారో ఏ ఒక్క‌రు చెప్ప‌కుండానే క‌ళ్ల‌కు క‌న‌బ‌డుతోంది. బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగిన స‌మ‌యంలోనే ఏపీకి అంతంత‌మాత్రంగా నిధులు విడుద‌ల చేసిన న‌రేంద్ర మోదీ స‌ర్కారు.. ఎన్డీఏ నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌స్తుత త‌రుణంలో ఇక‌పై నిధుల విడుద‌ల‌లో మ‌రింత తొండి రాజ‌కీయం చేయ‌డం ఖాయ‌మ‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో పోల‌వ‌రం, రాజ‌ధాని నిర్మాణాల్లో ఈ ఏడాది బాబుకు చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయ‌మ‌నే వాద‌నే వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే... పార్టీలో అంత‌ర్గ‌త విభేదాల‌తో ఇప్పుడు బాబుకు కొత్త త‌ల‌నొప్పులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీడీపీలో గ్రూపు త‌గాదాలు తారాస్థాయికే చేరుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకు నిద‌ర్శ‌న‌మే... క‌ర్నూలు జిల్లాకు చెందిన మంత్రి అఖిల ప్రియ‌, ఏవీ సుబ్బారెడ్డిల వివాదం. ఇప్ప‌టికే పార్టీకి చెందిన సీనియ‌ర్లు చాలా మంది ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించే య‌త్నం చేసినా ఫ‌లితం క‌నిపించ‌లేదు. దీంతో చివ‌ర‌కు చంద్ర‌బాబే రంగంలోకి దిగ‌క త‌ప్ప‌లేదు. ఈ లెక్క‌న ప్ర‌స్తుతం దాదాపుగా వందకు పైగా అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల్లో గ్రూపు త‌గాదాలు కొన‌సాగుతుంటే... వాటన్నింటి ప‌రిష్కారం కోసం బాబు రంగంలోకి దిగాలంటే అయ్యే ప‌ని కాద‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా అటు బ‌య‌ట నుంచి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు బాబుకు స్వాగ‌తం ప‌లుకుతుంటే... ఇటు సొంత పార్టీ త‌గాదాలు బాబును మ‌రింత‌గా ఇబ్బంది పెడుతున్నాయ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. వీటన్నింటినీ అధిగ‌మించి బాబు బ‌య‌ట‌ప‌డ‌టం అంత ఈజీ ఏమీ కాద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News