`పంచాయ‌తీ` ఎన్నిక‌ల‌పై బాబు ప‌రేషాన్!

Update: 2018-05-21 10:46 GMT
టీడీపీ జ‌న‌రంజ‌క పాల‌న‌ను అందిస్తోంది....నా హ‌యాంలో ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉన్నారు. ప్ర‌భుత్వం, నా ప‌నితీరుపై 80 శాతం సంతృప్తిగా ఉన్నారు....ప్ర‌జా సంక్షేమ‌మే నా ధ్యేయం.....నా 40 ఏళ్ల అనుభ‌వాన్ని రంగ‌రించి రాజ‌ధానిని అందంగా తీర్చిదిద్దుతా....ఇవ‌న్నీ ఏపీ సీఎం చంద్ర‌బాబు అరిగిపోయిన రికార్డులా చెప్పే మాట‌లు. ఈ డైలాగుల‌న్నీ విన్న వారెవ‌రైనా స‌రే....ఇప్ప‌టికిపుడు ముందుస్తు ఎన్నిక‌లు వ‌చ్చినా చంద్ర‌బాబే సీఎం కావ‌డం ఖాయ‌మ‌ని ఫిక్స్ అవుతారు. అయితే, వాస్త‌వం మాత్రం మ‌రోలా ఉంది. చంద్ర‌బాబుదంతా మేక‌పోతు గాంభీర్య‌మ‌ని ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వెల్లుత్తుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంగ‌తి ప‌క్క‌న బెడితే....క‌నీసం స్థానిక సంస్థల ఎన్నిక‌లు కూడా నిర్వ‌హించేందుకు చంద్ర‌బాబుకు ధైర్యం చాల‌డం లేద‌ని టాక్. అందుకోసం...త్వ‌ర‌లోజ‌ర‌గాల్సిన పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను కూడా బాబుగారు వాయిది వేయించే కార్య‌క్రమంలో బిజీగా ఉన్నార‌ట‌.  ఎన్నిక‌ల వాయిదా విష‌యాన్ని స్వ‌యంగా బాబుగారి భ‌జ‌న ప‌త్రిక క‌థ‌నంగా ప్ర‌చురించ‌డంతో ఈ వాద‌న‌కు బ‌లం చేకూరుతోంది.

మ‌రో 11నెలల్లో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అంత‌కుముందే ఆగస్టు 25వ తేదీతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ల పదవీ కాలం ముగుస్తుంది. లెక్క‌ప్ర‌కార‌మైతే...ఆ పంచాయ‌తీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సి ఉంది. అయితే, చంద్ర‌బాబు మాత్రం...ఏవో కుంటి సాకులు చెప్పి వాటిని వాయిదా వేయాల‌ని చూస్తున్నార‌ట‌. ఇదే విష‌యాన్ని టీడీపీ కి ప్ర‌ధాన అనుకూల ప‌త్రిక వెల్ల‌డించింది.

వాటితో పాటు మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను కూడా త‌ర్వాత నిర్వ‌హించాల‌ని బాబుగారు భావిస్తున్నార‌ట‌. ఇదే విష‌యం గురించి ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాయబోతోన్నార‌ట‌. ఎన్నిక‌ల‌ నిర్వహణకు తమకు కొంత సమయం ఇవ్వాల‌ని కోర‌నుంద‌ట‌. లోగుట్టు పెరుమాళ్ల‌కెరుక అన్న‌ట్లు....ఈ ఎన్నిక‌లు వాయిదా వేయ‌డానికి ఓట‌మి భ‌య‌మే ప్ర‌ధాన‌కార‌ణ‌మ‌ని చెప్ప‌క్క‌ర‌లేదు. పంచాయ‌తీ - మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓడిపోతే.....ఆ ఎఫెక్ట్ సాధార‌ణ ఎన్నిక‌ల‌పై ప‌డుతుంద‌ని బాబుగారి ఆవేద‌న‌. ఆ భ‌యంతోనే నంద్యాల ఉప ఎన్నిక వాయిదా  వేయించేందుకు శాయ‌శ‌క్తులా సుజ‌నాచౌద‌రితో ప్ర‌య‌త్నాలు చేయించార‌ట‌. సుజ‌నాకు ఈసీని మేనేజ్ చేయ‌డం కుద‌ర‌పోవ‌డంతో బాబుగారు సుజ‌నాపై అస‌హ‌నం కూడా వ్య‌క్తం చేశార‌ట‌. మ‌రి ఈ ఓట‌మి భ‌యాన్ని వీడి ఆ ఎన్నిక‌ల‌ను బాబుగారు నిర్వ‌హిస్తారో లేదో వేచి చూడాలి.
Tags:    

Similar News