సమస్య వింటే చాలు బాబు కదిలిపోతున్నారు

Update: 2015-10-03 05:29 GMT
పరిపాలన విషయంలో కరుకుగా వ్యవహరించటం.. చాలా అంశాల పట్ల నాటకీయంగా స్పందించే వైఖరికి చంద్రబాబు కాస్త దూరమన్న విమర్శ ఉంది. అయితే.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యపై స్పందించటమే కాదు.. తక్షణమే వరాలు ప్రకటించటం.. అందరి మెప్పు పొందుతున్నారు.

తాజాగా ఏపీలోని గుంటూరులో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ విద్యార్థులను వేదిక మీద పిలిచి తమ అనుభవాల్ని వెల్లడించాల్సిందిగా కోరారు. ఈ సమయంలో విద్యార్థిని కోటేశ్వరి తన దృష్టికి వచ్చిన ఒక సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తాను ఎన్ సీసీ డ్రెస్సులో ఉంటే తనను పోలీసుగా భావించి.. ముఖ్యమంత్రికి తన సమస్య చెప్పాలని 80ఏళ్ల వృద్ధురాలి సమస్యను ఆమె చెప్పుకొచ్చారు.

గుంటూరు బ్రాడీపేటకు చెందిన కమలమ్మ అనే 80ఏళ్ల వృద్ధురాలికి భర్త.. కుమారులు చనిపోయారని.. ఆమెకు గతంలో రూ.200 వృద్ధాప్య పింఛన్ వచ్చేదని.. రూ.వెయ్యి చేసిన తర్వాత రావటం ఆగిపోయిందని వెల్లడించారు. దీనికి వెంటనే స్పందించిన చంద్రబాబు.. సదరు వృద్ధురాలు ఇక్కడే ఉందా అని అడగటం.. ఆమెను వేదిక మీదకు పిలిపించి.. ఆమెకు వెంటనే పింఛన్ ఇవ్వాలని చెప్పటమే కాదు రూ.25వేల ఆర్థిక సాయాన్ని కూడా అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. పదేళ్ల విరామం తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మార్పు మంచిదే.
Tags:    

Similar News