ఇదీ బాబు లెక్క‌: ఏడాదిలోనే సార్వ‌త్రికం

Update: 2017-09-05 04:32 GMT
గెలుపు స‌హ‌జంగానే ఉత్సాహాన్ని ఇస్తుంది.  ఆ ఉత్సాహంతో మ‌రింత దూసుకెళ్లాల‌నుకోవ‌టం త‌ప్పేం కాదు. కానీ.. ఆ దూకుడు త‌ర్క‌బ‌ద్ధంగా ఉండాలే త‌ప్పించి.. తొంద‌ర‌పాటుగా ఉండ‌కూడ‌దు. ఉత్సాహం ఉర‌క‌లెత్తే వేళ ఊగిపోయే క‌న్నా.. విచ‌క్ష‌ణ‌తో వ్య‌వ‌హ‌రించ‌టం.. సంయ‌మ‌నాన్ని పాటించ‌టం చాలా ముఖ్యం. కానీ.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబులో ఇవ‌న్నీ మిస్ అవుతున్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇంత‌కాలం సార్వ‌త్రిక ఎన్నిక‌ల మీద నోరు విప్ప‌ని చంద్ర‌బాబు తాజాగా మాత్రం.. ఆస‌క్తిక‌ర అంశాల్ని తెర మీద‌కు తెచ్చారు. సార్వ‌త్రిక ఎన్నిక‌లు షెడ్యూల్ కంటే ముంద‌స్తుగా వ‌చ్చేస్తాయ‌న్న మాట చెప్పారు. 2019  మేలో జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు 2018 డిసెంబ‌రులోనే వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదంటూ ఎన్నిక‌ల సైర‌న్ మోగించేశారు. ఏడాదిలోనే ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని అనుకొని ప‌ని చేయాల‌న్న మాట చెప్పారు.

ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే మ‌రో 15-16 నెల‌లే గ‌డువు ఉంటుంద‌ని.. అందులో ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌కు ఇచ్చిన స‌మాయాన్ని తీసేస్తే గ‌డువు ఏడాదే ఉంటుంద‌న్నారు. ఒక‌వేళ 2019లో ఎన్నిక‌లు వ‌చ్చినా చివ‌రి ఆర్నెల్ల‌లో చేసేదేమీ ఉండ‌ద‌న్నారు.  ఈ నేప‌థ్యంలో ఇప్పుడున్న స‌మ‌యాన్ని విభ‌జించుకొని మొద‌టి ఆర్నెల్లు ప‌బ్లిక్ మేనేజ్ మెంట్ మీదా.. త‌ర్వాత ఆర్నెల్లు పొలిటిక‌ల్ మేనేజ్ మెంట్ మీద దృష్టి సారించాల‌న్నారు.

ప్ర‌తి రోజూ ఒక ప‌రీక్ష అన్న‌ట్లుగా ప‌ని చేయాల‌ని.. సార్వత్రిక ఎన్నిక‌ల‌కు కౌంట్ డౌన్ మొద‌లైంద‌న్నారు. ఎంపీలు.. ఎమ్మెల్యేలంతా 24 గంట‌లూ ప్ర‌జ‌ల్లోనే ఉండాల‌ని ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల సంతృప్త స్థాయిని మ‌రో 10 శాతం పెంచాల‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.  ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప‌ట్ల 49 శాతం మంది సంతృప్తిగా ఉన్నార‌ని.. 32 శాతం మంది సంతృప్తిగా లేమ‌ని చెప్పార‌న్న విష‌యాన్ని చెప్పి బాబు.. కాల్ సెంట‌ర్‌ కు ఫోన్ చేసిన వారిలో 9 శాతం మంది ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప‌ట్ల అసంతీప్తిలో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ఆ వివ‌రాల్ని ఎమ్మెల్యేల‌కు ఇస్తామంటూ వాస్త‌వాల్ని ఓవైపు విప్పి చెబుతూనే.. మ‌రోవైపు భారీ గెలుపు ధీమాను వ్య‌క్తం చేయ‌టం విశేషం.  

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ వ్యూహం ఎలా ఉండాల‌న్న విష‌యాన్ని వివ‌రిస్తూ.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సంతృప్తి ప‌ర్చ‌టం ప‌బ్లిక్ మేనేజ్ మెంట్ అని.. దాన్ని పార్టీకి అనుకూలంగా మార్చుకోవ‌టం పొలిటిక‌ల్ మేనేజ్ మెంట్ అని.. ఓట్ల రూపంలో మ‌ళ్లించ‌టం పోల్ మేనేజ్ మెంట్ గా అభివ‌ర్ణించారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో అదే వ్యూహాన్ని అమ‌లు చేయ‌టంతో అద్భుత ఫ‌లితాల్ని సాధించామ‌ని.. ఇదే వ్యూహంతో పార్టీ ముందుకెళితే అధికారం శాశ్విత‌మ‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఇన్ని చెప్పిన చంద్ర‌బాబు.. నంద్యాల ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఖ‌ర్చు చేసినట్లు చెబుతున్న రూ.200 కోట్ల ముచ్చ‌ట‌ను మాట వ‌ర‌స‌కు కూడా ప్ర‌స్తావించ‌టాన్ని మిస్ కాకూడ‌దు.
Tags:    

Similar News