బెంగాల్ బాణాన్ని బ‌య‌ట‌కు తీసిన బాబు

Update: 2019-02-06 08:26 GMT
దేశంలోనే సీనియ‌ర్ నాయ‌కుడిగా చెప్పుకునే ఏపీ సీఎం చంద్ర‌బాబు మీద చుర‌క‌లు వేసేటోళ్లు చాలామందే క‌నిపిస్తుంటారు. ఎవ‌రేం అన్నా అనుకోండి.. నా ప‌ని నే చేసుకుంటూ పోతాన‌న్న చందంగా వెళుతున్న చంద్ర‌బాబు తాజాగా త‌న ప్ర‌త్య‌ర్థుల‌పై అనూహ్య బాణాన్ని వ‌దిలారు. నాలుగేళ్ల పాటు మోడీ మీద ఈగ వాలినా తట్టుకోలేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. ప్ర‌ధానితో ఏపీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న విష‌యాన్ని నిర్దారించుకొని  పోరాటాన్ని షురూ చేశారు.

మ‌నం ఒక‌టి త‌లిస్తే.. ఎదుటోడు అందుకు భిన్నంగా త‌లిస్తే ఎవ‌రు మాత్రం ఏం చేయ‌గ‌ల‌రు?  చివ‌ర‌కు తోపు లాంటి బాబు సైతం ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. మోడీని మోస్తే.. ఆయ‌న క‌రుణ‌తో ఏపీకి ఎంతో కొంత సాయం అందుతుంద‌న్న అత్యాశ‌తో బాబు ప్ర‌ధానిని ఎంత‌లా పొగిడారో మ‌ర్చిపోలేం. చివ‌ర‌కు.. అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు గుప్పెడు మ‌ట్టి.. కాసిన్ని నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిన‌ప్పుడు కూడా ముఖం మీద చిరున‌వ్వు చెర‌గ‌నివ్వ‌కుండా ఊరుకున్నారు.

అయితే.. తానెంత ఓర్చుకున్నా.. మ‌రెంత భ‌రించినా మోడీతో చిల్లిగ‌వ్వ కూడా ప్ర‌యోజ‌నం లేద‌న్న విష‌యాన్ని గుర్తించిన ఆయ‌న‌.. ప్ర‌ధానిపై స‌మ‌రానికి రెఢీ అయ్యారు. ఏ మాట‌కు ఆ మాటే చెప్పాలి.. మోడీని పొగిడేట‌ప్పుడు ఏ విధంగా అయితే సిగ్గుప‌డ‌కుండా పొగిడేశారో.. తిట్టే విష‌యంలోనూ అంతే తీవ్రంగా విమ‌ర్శ‌లు చేశారు. దేశంలో మోడీకి ఎంతోమంది ప్ర‌త్య‌ర్థులు ఉన్నా.. బాబు తిట్టినంత భారీగా తిట్ట‌లేద‌ని చెప్పాలి.

అయితే.. అందుబాటులోకి వ‌చ్చిన సోష‌ల్ మీడియాలో బాబును టార్గెట్ చేస్తున్న వారు.. నాడు మోడీని పొగ‌డ్త‌లు.. ఇప్పుడు తెగ‌డ్త‌లు పెట్టి బాగా పాపుల‌ర్ చేస్తున్నారు. ఎన్నిక‌ల వేళ ఇలాంటివి మామూలే అనుకోండి. మొన్న‌టికి మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద ఎన్ని వీడియోలు వైర‌ల్ కాలేదు?  ఇప్పుడు అదే మాదిరి బాబు మీద కూడా వీడియోల మీద వీడియోలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

అన్ని యాంగిల్స్ లో త‌న ప్ర‌త్య‌ర్థులు త‌న‌పై దాడిని తీవ్ర‌త‌రం చేస్తున్న వేళ‌.. త‌న‌కొచ్చిన ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌ద‌ల‌టం లేదు చంద్ర‌బాబు. తాజాగా బెంగాల్ ఎపిసోడ్‌ లో మ‌మ‌త‌కు ద‌న్నుగా  బీజేపీయేత‌ర పార్టీల‌న్ని స్పందించ‌గా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఏపీ విప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ల్లెత్తు మాట అన‌లేదు.

ఇదే విష‌యాన్ని బాబు తాజాగా త‌న విమ‌ర్శ‌ల్లో ప్ర‌స్తావించారు. బెంగాల్ చ‌ర్య‌ను అంద‌రూ ఖండిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు జ‌గ‌న్ త‌ప్పించి మిగిలిన వారంతా త‌ప్పుప‌ట్టార‌న్నారు. ఆ ఇద్ద‌రూమోడీ క‌నుస‌న్న‌ల్లోనే ఉన్నార‌న్న విష‌యం బెంగాల్ ఎపిసోడ్‌ లో మ‌రోసారి స్ప‌ష్ట‌మైంద‌న్నారు. స‌మ‌యానికి త‌గ్గ‌ట్లు బెంగాల్ బాణాన్ని బ‌య‌ట‌కు తీసిన బాబుతో కేసీఆర్‌.. జ‌గ‌న్ ల‌కు ఇబ్బందే.


Tags:    

Similar News