కాంగ్రెస్‌ తో జ‌ట్టుకు బాబు సిద్ధం!

Update: 2018-09-07 05:50 GMT
ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ రాజ‌కీయం అంత‌కంత‌కూ వేడెక్కిపోనుంది. గ‌డిచిన కొంత‌కాలంగా వినిపిస్తున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల దిశ‌గా వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో క‌లిసి టీఆర్ ఎస్ అధినేత వేసిన ముంద‌స్తు వ్యూహాన్ని దెబ్బ తీసేలా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రంగంలోకి  దిగాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

విభ‌జ‌న అనంత‌రం కేసీఆర్ కార‌ణంగా తెలంగాణ‌లో టీడీపీ నామ‌రూపాల్లేకుండా పోయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అదును కోసం చూస్తున్న చంద్ర‌బాబుకు త‌గిన ద‌న్ను ల‌భించ‌క మౌనంగా ఉన్న ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. కాంగ్రెస్‌ తో జ‌త క‌ట్ట‌టం ద్వారా తెలంగాణ‌లో పార్టీ ఉనికిని నిల‌ప‌టంతో పాటు టీఆర్ ఎస్ అధినేత‌కు భారీ షాకిచ్చేలా బాబు ప్లాన్ చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇందులో భాగంగా ప్ర‌స్తుతానికి తెలంగాణ‌లో కాంగ్రెస్ తో క‌లిసి టీడీపీ పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.అయితే.. ఈ పొత్తుపై కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టంతో పాటు.. విషం క‌క్కే వీలుండ‌టంతో.. ఈ నిర్ణ‌యం కార‌ణంగా లాభం జ‌ర‌గ‌కున్నా ఫ‌ర్లేదు కానీ న‌ష్ట‌పోకుండా ఉండేలా వాద‌న‌ను సిద్ధం చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. మోడీ సాయంతో కేసీఆర్ ముంద‌స్తుకు వెళుతున్నార‌ని.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీకి మ‌ద్ద‌తు ఇచ్చేందుకే తాజా ఎన్నిక‌లన్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో పాటు.. ప‌లువురు మంత్రులతో క‌లిసి కీల‌క భేటీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు.. ముంద‌స్తు ఎన్నిక‌ల విష‌యాల‌తో పాటు.. కేసీఆర్ నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశం.. అందులో ప్ర‌స్తావించిన అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చ జ‌రిగింది.

ప్ర‌ధాని మోడీతో కేసీఆర్ ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన‌ట్లుగా బాబు భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.అసెంబ్లీ ర‌ద్దుకు ముందు నెల‌లో మూడుసార్లు కేసీఆర్ ఢిల్లీకి వెళ్ల‌టం.. ప్ర‌ధానిని క‌ల‌సి రావ‌టం ఇందుకు ఇండికేష‌న్ గా బాబు చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. మోడీ ద‌న్నుతో కేసీఆర్ ముంద‌స్తుకు వెళుతున్న వేళ‌.. మోడీని రాజకీయంగా దెబ్బ తీయ‌టంతో పాటు.. తెలంగాణ‌లో కేసీఆర్ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడేందుకు వీలుగా బ‌ల‌మైన‌ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల‌న్న దిశ‌గా బాబు ప్లాన్ చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.

కాంగ్రెస్ తో పొత్తు విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించిన త‌ర్వాత వ‌చ్చే వ్య‌తిరేక‌త‌ను ఎలా మేనేజ్ చేయాలి?  ప్ర‌జ‌ల్ని సంతృప్తి ప‌రిచేలా ఎలాంటి వాద‌న‌ను వినిపించాల‌న్న అంశంపై క‌స‌రత్తు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేలు బ‌రిలో ఉన్న చోట్ల టీఆర్ ఎస్ అభ్య‌ర్థుల్ని నిల‌బెట్ట‌క‌పోవ‌టం వెనుక ఆ పార్టీతో ఉన్న స‌యోధ్యే కార‌ణంగా బాబు భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

మీడియా స‌మావేశంలో కేసీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌టాన్ని అర్థం చేసుకోవ‌చ్చ‌ని.. కానీ తెలంగాణ‌లో పెద్ద‌గా బ‌లం లేని త‌మ పైనా కేసీఆర్ చేసిన విమ‌ర్శ‌ల పైనా బాబు చ‌ర్చ జ‌రిపిన‌ట్లుగా తెలుస్తోంది. త‌మ‌ను బూచిగా చూపించి ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి రాజ‌కీయ ల‌బ్థి పొందాల‌న్నదే  కేసీఆర్ ఉద్దేశ‌మ‌న్న భావ‌నను బాబు వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇది మోడీ వ్యూహ‌మే అయి ఉంటుంద‌న్న ఆలోచ‌న బాబు నోట వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం. ఇలాంటి నేప‌థ్యంలో మోడీకి షాకిచ్చేందుకు వీలుగా కాంగ్రెస్ తో పొత్తు విష‌యంపై పార్టీ నేత‌ల మ‌ధ్య స‌మాలోచ‌న‌లు జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. ఒక‌వేళ అదే నిజ‌మైతే.. కేసీఆర్ స్పంద‌న మ‌రింత ఘాటుగా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News