శ్వేతపత్రం విడుద‌ల చేస్తే పోలా బాబు?

Update: 2017-12-09 05:50 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు చెప్పే మాట‌లకు లాజిక్  అన్న‌ది అస్స‌లు క‌నిపించ‌దు. త‌న‌కున్న క‌మిట్ మెంట్ గురించి ఏపీ అభివృద్ధి గురించి.. అమ‌రావ‌తి నిర్మాణం గురించి గంట‌ల కొద్దీ  మాట‌లు చెప్పే చంద్ర‌బాబు.. సూటిగా స్ప‌ష్టంగా ప్ర‌శ్న అడిగితే మాత్రం స‌మాధానం చెప్ప‌కుండా పోవ‌టం క‌నిపిస్తుంది.

గ‌డిచిన కొద్దిరోజులుగా నానుతున్న పోల‌వ‌రం ప్రాజెక్టు మీద శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయ‌మ‌న్న డిమాండ్ పై బాబు రియాక్ట్ అవుతున్న తీరు ఇప్పుడు ప‌లు సందేహాల‌కు తెర తీస్తుంది. విప‌క్ష నేత‌లు లెక్క‌లు అడిగితే చెప్పేందుకు ఇగో అడ్డు వ‌స్తుంద‌ని అనుకుంటే.. చివ‌ర‌కు మిత్రుడైన ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం లెక్క‌లు చెప్పాల‌ని అడుగుతున్నారు క‌దా? ఆయ‌న కోస‌మైనా లెక్క‌లు చెప్పేస్తే పోలా?

లెక్క‌ల మాట వ‌చ్చినంత‌నే స్పందించే చంద్ర‌బాబు.. పోల‌వ‌రం మీద శ్వేత‌ప‌త్రం అక్క‌ర్లేద‌ని.. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివ‌రాల‌న్నీ వెబ్ సైట్ లో ఉంచామ‌ని కావాలంటే అందులో చెక్ చేసుకోవాల‌ని చెబుతున్నారు. వెబ్ సైటు.. ఆన్ లైన్ లాంటి మాట‌ల్ని ప‌క్క‌న పెట్టేసి.. ఎంచ‌క్కా ఒక శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేస్తే.. అందులో ప్రాజెక్టు ముచ్చ‌ట అంతా ఉంటుంది. అక్క‌డితో ఇష్యూ క్లోజ్ అవుతుంది క‌దా? అంటే మాత్రం స‌సేమిరా అన‌టం బాబు మాట‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

అదేమంటే.. పోల‌వ‌రం ప్రాజెక్టును అడ్డుకోవ‌టం కోస‌మే ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్షం ప్ర‌య‌త్నిస్తుంద‌ని.. అబ‌ద్ధాల‌ను.. అభూత క‌ల్ప‌ల‌న‌ను ప్ర‌చారం చేస్తుందంటూ మండిప‌డుతున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టుపై నిజాయితీగా స‌మాధానం చెప్పాలంటూ మంత్రుల‌కు.. ఎమ్మెల్యేల‌కు సూచ‌న చేశారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు మీద కేంద్రం అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇప్ప‌టికే పంపామ‌ని.. అసెంబ్లీ స‌మావేశాల్లోనూ పూర్తి వివ‌రాల్ని స‌భ ముందు ఉంచామ‌ని చెబుతున్నారు. మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా ఉన్న‌ప్పుడు విప‌క్ష అడిగిన‌ట్లుగా శ్వేత‌ప‌త్రాన్ని స‌మ‌ర్పిస్తే స‌రిపోతుందిగా?  కేంద్రం అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చామ‌ని చెబుతున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రి విప‌క్ష నేతలు అడిగిన శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయ‌టానికి ఉన్న నొప్పి ఏమిటో ఒక ప‌ట్టాన అర్థం కాదు. అది చేశాం.. ఇది చేశామ‌న్న మాట‌ల్ని క‌ట్టి పెట్టి.. విప‌క్ష నేత‌లు కోరుకున్న‌ట్లుగా శ్వేత‌ప‌త్రాన్ని విడుద‌ల చేస్తే స‌రిపోతుంది. అది మాత్రం చేయ‌నంటున్న బాబు తీరు దేనికి సంకేతమ‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.
Tags:    

Similar News