అనంత కుంప‌టిని బాబు సెట్ చేసేశార‌ట‌

Update: 2017-09-08 13:00 GMT
రాయ‌ల‌సీమ‌లో కీల‌క జిల్లా అయిన అనంత‌పురంలో నెల‌కొన్న క్ర‌మ‌శిక్ష‌ణ ఎపిసోడ్‌కు టీడీపీ అదినేత నారా చంద్ర‌బాబు నాయుడు చెక్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ రాజీనామా వ్యవహారం టీడీపీలో అంతర్గతంగా కుంపటి రాజేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒప్పందం మేరకు చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండా కాలయాపన చేస్తుండటం, అధిష్ఠానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ వ్యవహరిస్తుండటం పార్టీకి నష్టం కలిగించేలా ఉందని జిల్లా పార్టీ నేతల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ముఖ్య‌మంత్రి అనంత‌పురం ప‌ర్య‌ట‌న‌లో దీనికి ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్లు స‌మాచారం.

మాజీ మంత్రి - దివంగత పరిటాల రవికి చమన్ కుడిభజంగా ఉండేవారు. అప్పట్లో అనేక వివాదాల్లో చమన్ ఉండటం, కేసులు నమోదు కావడం, అజ్ఞాత జీవితం గడపడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అజ్ఞాతం వీడి బయటకు వచ్చిన నేపథ్యంలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ పరిస్థితుల్లో చమన్ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఈ నేపథ్యంలో జడ్పీ చైర్మన్ పదవికి పోటీ పడ‌గా...మంత్రి పరిటాల సునీత అండగా ఉండటం, ఆమెకు తోడు కాలవ శ్రీనివాసులు - జిల్లా అధ్యక్షుడు - పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారధి కలిసి సీఎంను ఒప్పించారు. జడ్పీ చైర్మన్‌ గా పూల నాగరాజు - చమన్ మధ్యే పోటీ నెలకొంది. దీంతో జడ్పీటీసీ అభ్యర్థుల్ని గెలిపించుకునే బాధ్యత ఇరువురిపైనా జిల్లా నేతలు పెట్టారు. ఈ క్రమంలో అత్యధిక స్థానాలు టీడీపీ కైవసం చేసుకోవడంతో చైర్మన్ పదవిలో చెరో రెండున్నరేళ్ల పాటు కొనసాగేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

అయితే కాల పరిమితి పూర్తయినా చమన్ ఏదో ఒక సాకు - ఎత్తుగడతో రాజీనామాను వాయిదా వేస్తుండటంతో జిల్లా నేతల్లో అసహనం పెరిగిపోయింది. చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండా తనకు కనిపించవద్దని చమన్‌ కు  సీఎం చంద్రబాబు సీరియస్‌ గా చెప్పారని గ‌తంలో వార్త‌లు విచ్చిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే నంద్యాల ఉప ఎన్నిక విష‌యంలో పెద్ద‌గా ఒత్తిడి చేయ‌లేదు. కాగా తాజాగా చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో ఈ వివాదానికి చెక్ పెట్టిన‌ట్లు స‌మాచారం.  రాజీనామా అనంతరం చమన్ ను అర్బన్ డెవలప్ మెంట్ ఛైర్మన్ గా చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. మిగిలిన గ‌డువంతా నాగ‌రాజు జెడ్పీ చైర్మ‌న్‌ గా ఉండ‌నున్నారు.
Tags:    

Similar News