మౌనంగా ఉండ‌కుండా.. ఇప్పుడు కూడా మాట్లాడాలా బాబు?

Update: 2019-05-20 10:33 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తాము గెలుస్తామ‌న్న మాట‌ను అదే ప‌నిగా ఆరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మాదిరి చెప్పటంలో ఏపీ ముఖ్య‌మంత్రిచంద్ర‌బాబు త‌ర్వాతే ఎవ‌రైనా.  ఆయ‌న గెలుపు మాట‌పై భిన్నాభిప్రాయాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఐదేళ్ల బాబు పాల‌న‌తో విసుగు చెందిన ఏపీ ఓటర్లు ఈసారి జ‌గ‌న్ కు అధికారాన్ని కట్ట‌బెట్టాల‌ని డిసైడ్ అయిన‌ట్లుగా అంచ‌నాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఇది వాస్త‌వ‌మే అన్న చందంగా ఆదివారం సాయంత్రం విడుద‌లైన ఎగ్జిట్ ఫ‌లితాల్లో ప‌లువురు  స్ప‌ష్టం చేశారు. ల‌గ‌డ‌పాటి లాంటి ఒక‌రిద్ద‌రు మిన‌హా మిగిలిన‌వారంతా గెలుపు జ‌గ‌న్ దేన‌ని తేల్చారు. ఇదిలా ఉంటే.. ఎగ్జిట్ పోల్స్ మీద తాజాగా స్పందించారు చంద్ర‌బాబు. ఎవ‌రెన్ని చెప్పినా ఏపీలో నూటికి వెయ్యి శాతం గెలుపు టీడీపీదేన‌న్న ధీమాను వ్య‌క్తం చేశారు. గెలుపు విష‌యంలో ఎలాంటి అనుమానాలు అక్క‌ర్లేద‌న్నారు.

తాను ఒక్క పిలుపు ఇస్తే.. ప్ర‌జ‌లు ఓట్లు వేసేందుకు వ‌ర‌ద‌లా వ‌చ్చార‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. స‌ర్వేలు చేయ‌టం ప్ర‌తి ఒక్క‌రికి అల‌వాటుగా మారింద‌న్న ఆయ‌న‌.. గ‌డిచిన ఐదేళ్ల‌లో ఏపీలో జ‌రిగినంత సంక్షేమం ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌న్నారు. ఇందులో ఒక్క శాతం కూడా అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఎప్ప‌టిలానే మైకు ముందు బాబు అదే ప‌నిగా చెప్పిందే.. చెప్ప‌టం తెలిసిందే.

బాబు ధీమాను కాద‌న‌టం లేదు. ఇప్పుడింత ఆత్మ‌విశ్వాసాన్ని వ్య‌క్తం చేసే బ‌దులు.. మూడు రోజుల పాటు మౌనంగా ఉంటే బాబుకు పోయేదేముంది?  ఒక‌వేళ ఆయ‌న చెప్పిన‌ట్లే గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ.. నూటికి వెయ్యి శాతం క‌చ్ఛితంగా గెలుస్తామ‌న్న మాట చెప్పి.. రేపొద్దున ఓడితే..ఎంత ఎట‌కారం అవుతార‌న్న విష‌యాన్ని బాబు ఎందుకు ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న‌ది ప్ర‌శ్న‌. అనుభ‌వంలోకి వ‌స్తే కానీ త‌త్త్వం బోధ ప‌డ‌ద‌న్న విష‌యం బాబులాంటోళ్ల‌ను చూసే చెప్పుంటారేమో?


Tags:    

Similar News