కేసీఆర్ అడిగిన గ్రామాలేమిటో బాబుకు తెలీదంట

Update: 2016-02-21 04:50 GMT
కొద్ది రోజుల క్రితం తన రెండు రోజుల ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేసిన సంగతి తెలిసిందే. జిల్లాకు చెందిన ఏడు మండలాలకు చెందిన కొన్ని గ్రామాల్ని ఏపీలో కలిపేసిన వాటిలో కొన్నింటిని తెలంగాణకు తిరిగి ఇచ్చేందుకు ఏపీ సీఎం సిద్ధంగా ఉన్నారని.. ఆయన తనకు మాట ఇచ్చినట్లుగా కేసీఆర్ వెల్లడించారు. ఈ వ్యాఖ్య సంచలనంగా మారింది. అయితే.. ఈ విషయం మీద బాబు నేరుగా స్పందించింది లేదు.

శనివారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్య ప్రశ్న రూపంలో బాబు ముందుకు వచ్చింది. దీంతో.. ఆయన ఈ విషయంపై స్పందించక తప్పింది కాదు. కేసీఆర్ చెప్పిన మాట తనకు తెలీదని.. ఆ అంశం మీద తనకు సమాచారం లేదని.. కేసీఆర్ ఏ గ్రామాలు అడిగారో తనకు తెలీదని బాబు వ్యాఖ్యానించటం గమనార్హం. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని మండలాల్ని ఏపీలోకి కలుపుతూ కేంద్రం నిర్ణయం తీసుకునే వరకూతాను ప్రమాణస్వీకారం చేయనని చెప్పానని.. అనంతరం కేంద్రం ముందుకొచ్చి ఆయా గ్రామాల్ని తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ చేసినట్లుగా బాబు గుర్తు చేశారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఏపీలో కలిసిన గ్రామాల్ని తెలంగాణకు ఇస్తానని బాబే తనకు మాట ఇచ్చానని కేసీఆర్ స్పష్టం చేస్తుంటే.. గ్రామాల్ని తెలంగాణకు తిరిగి ఇచ్చే విషయం మీద తనకు సమాచారం లేదని.. ఆయన ఏ గ్రామాల్ని అడిగారో తనకు తెలీదంటూ బాబు వ్యాఖ్యానించటం గమనార్హం. మరి.. బాబు వ్యాఖ్యలపై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News