కంగారు పడ్డ బాబు 'నేను మాట్లాడలేదు'

Update: 2018-02-04 09:09 GMT
అసలే తెలుగుదేశం పార్టీ – భాజపా సంబంధాలు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల అనుబంధం ఎంత దయనీయంగా ఉన్నదంటే.. పక్కవాళ్లు తుమ్మినా కూడా.. వారి ముక్కు ఊడిపోయే విధంగా ఉన్నది. అలాంటి నేపథ్యంలో చంద్రబాబునాయుడుకు ఫుల్ రేంజిలో కంగారు పెట్టగల పరిణామం ఆదివారం నాడు చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీతో ఇటీవలే తెగతెంపులు చేసుకున్న శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో చంద్రబాబునాయుడు ఫోనులో మాట్లాడారు.. అనే వార్తలు విస్తృతంగా ప్రచారం కావడమే ఇందుకు కారణం. అసలే బలహీనంగా ఉన్న తమ రెండు పార్టీల మధ్య బంధం తెగడానికి తమ ప్రమేయం లేకుండానే.. నష్టం జరిగిపోతుందని ఆయన భయపడినట్లుగా కనిపిస్తోంది.

ఎంపీలతో సమావేశం పూర్తయిన తర్వాత.. తాను ఠాక్రేతో ఫోనులో మాట్లాడినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని చంద్రబాబునాయుడు ఖండించారు. తాను ఎవ్వరితోనూ ఫోనులో మాట్లాడలేదని ఆయన చెప్పారు. ఆ తర్వాత... ఎంపీలతో సమావేశం గురించి ప్రెస్ మీట్ పెట్టిన సుజనా చౌదరి కూడా ఇదే సంగతి చెప్పారు. తమ పార్టీ అధినేత ఎవ్వరితోనూ మాట్లాడలేదు.. అవన్నీ పుకార్లు అని కొట్టి పారేశారు.

మొత్తానికి ఇప్పటికిప్పుడు ఎన్డీయే కూటమినుంచి బయటకు వచ్చే ఉద్దేశం ఏదీ తెలుగుదేశం పార్టీకి లేదు అని స్పష్టం అయిపోయింది. ఇప్పటికే కాదు కదా... ఇంకా ఇలాంటి ఎన్ని అవమానాలు జరిగినప్పటికీ.. రాష్ట్రప్రయోజనాలకు ఎంతగా విఘాతం కలిగినప్పటికీ.. తెలుగుదేశం పార్టీ ఆ కూటమిలోంచి బయటకు వచ్చే సాహసం చేసే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఇక్కడ మరో విమర్శ కూడా చంద్రబాబు మీద వినిపిస్తోంది. ఆయన అసలు ఎవ్వరితోనూ ఫోనులో మాట్లాడలేదని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. నిజానికి రాష్ట్రానికి పట్టిన ఖర్మం కూడా అదే అని ప్రజలు అంటున్నారు. బడ్జెట్ కు ముందు, బడ్జెట్ లో ద్రోహం జరిగిన తర్వాత.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో గానీ - ప్రధానితో గానీ, కనీసం అమిత్ షా తోగానీ మాట్లాడే ప్రయత్నం చేసి ఉండాల్సిందని... తమ రాష్ట్ర ప్రజల ఆవేదనను వారికి తెలియజెప్పే ప్రయత్నం చేసి ఉండాల్సిందని పలువురు అంటున్నారు.
Tags:    

Similar News