ప్ర‌త్యేక హోదాపై బాబు ఇలా డిసైడ‌య్యారు...

Update: 2015-08-08 16:48 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా అంశం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అవుతున్న నేప‌థ్యంలో ఏపీలోని పార్టీల‌న్ని త‌మ త‌మ వైఖ‌రుల‌ను ప్ర‌క‌టించేస్తున్నాయి. బీజేపీ ఈ విష‌యంలోన‌ర్మ‌గ‌ర్భంగా స్పందిస్తుండ‌గా... టీడీపీ లౌక్యంగా మాట్లాడుతోంది. ఈ రెండు పార్టీలు మిన‌హా ఏపీలోని కాంగ్రెస్‌, వైసీపీ, క‌మ్యూనిస్టులు, ఇత‌ర‌త్రా సంఘాల వారు ఏపీ సీఎం చంద్ర‌బాబును లక్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.

ఆలస్యమైనా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాక తప్పదని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ విష‌యంలో సంయ‌మ‌నం పాటించాల‌ని సూచించారు. ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోరు సభలో కోటి అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనపై ఆయన స్పందించారు. కోటి ఆత్మహత్యా యత్నం తనను ఎంతగానో బాధించిందని  తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదా రాదనే ఆవేదనతో, ఆవేశంతో యువత బలిదానాలు చేసుకోవద్దని చంద్ర‌బాబు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఆత్మహత్యా యత్నం చేసిన కోటికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈవిష‌యంలో జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలకు ఫోన్ చేసి ఆదేశించారు. ఆత్మహత్యలకు పాల్పడితే ప్రత్యేక హోదా రాదని, దీన్ని యువత గుర్తించాలని చంద్రబాబు సూచించారు.

Tags:    

Similar News