ఓటుకు నోటు: మ‌ళ్లీ బాబు ప్ర‌స్తావన

Update: 2015-11-01 06:24 GMT
విజ‌య‌వాడ‌లో తాత్కాలిక రాజ‌ధాని ఏర్పాటుచేసుకొని ప‌రిపాల‌న కొన‌సాగిస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇపుడు అక్క‌డి నుంచే ప‌రిపాల‌న‌పై పూర్తి స్థాయి ప‌ట్టు సాధించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ఓటుకు నోటు కేసును ప్ర‌స్తావించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయంలో ఇంటెలిజెన్స్‌ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్ర‌బాబు.... రాష్ర్టంలోని శాంతి భద్రతల గురించి చ‌ర్చించారు. దాదాపు గంట పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వివిధ ఆందోళనలు ప్రస్తావనకు వచ్చాయి.

రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజా ఆందోళనలపై పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని నిఘా అధికారులను చంద్ర‌బాబు ఆదేశించారు. భూ సమీకరణ, సేకరణలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై చర్చ సాగిన‌ట్లు స‌మాచారం. ఈ ప్రాంతాల్లో రాజకీయ పార్టీల కదలికలపై పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో జరిగే ప్రతి అంశానికి సంబంధించి సూక్ష్మస్థాయిలో వివరాలు సేకరించాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. రాజధాని ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఒకటి, రెండు సంఘటనలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు స‌మాచారం.

ఓటుకు నోటు కేసులో తెలంగాణా ప్రభుత్వం భవిష్యత్‌ లో ఏం చేయనుందన్న అంశంపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని, గతంలో జరిగిన వైఫల్యాలను మళ్లీ జరగనియ్యవద్దని చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. రాష్రంలో మావోయిస్టుల కదలికలు, వారి ప్రభావంపై ఒక నివేదికను రూపొందించాలని బాబు సూచించారు. కేంద్ర హోంమంత్రి వద్ద తీవ్రవాదంపై జరగనున్న సమావేశం సంద‌ర్భంగా ఈ నివేదిక ఇవ్వ‌నున్నారు.
Tags:    

Similar News