వరల్డ్ బ్యాంకు రుణం రద్దు..టీడీపీ భాగోతాలే కారణమట!

Update: 2019-07-22 17:39 GMT
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి కేటాయించిన రుణాన్ని రద్దు చేసిన వరల్డ్ బ్యాంకు నిర్ణయంపై ఇప్పుడు పెద్ద రాద్ధాంతమే నడుస్తోంది. వైసీపీ అధికారం చేపట్టిన క్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న అపసవ్య విధానాల కారణంగానే వరల్డ్ బ్యాంకు రుణాన్ని రద్దు చేసిందని టీడీపీ శిబిరం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ వాదనను ఆ పార్టీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున పతాక శీర్షికల్లో ప్రచురిస్తూ  దీనిపై తనదైన శైలి పైత్యాన్ని ప్రదర్శిస్తోంది. అయితే వరల్డ్ బ్యాంకు రుణాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణాలే కారణమని వైసీపీ కూడా ఆరోపిస్తోంది. ఇదే వాదనను సోమవారం నాటి శాసనసభా సమావేశాల్లో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి మరోమారు కాస్తంత గట్టిగానే కాకుండా ఫుల్ క్లారిటీతో చెప్పేశారు.

టీడీపీ చేసిన అరాచకాల వల్లే వరల్డ్ బ్యాంకు రుణం రద్దైందని బుగ్గన తనదైన శైలిలో కుండబద్దలు కొట్టారు. అమరావతికి మంజూరు చేసిన రుణాన్ని రద్దు చేస్తూ వరల్డ్ బ్యాంకు తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని మొదలెట్టిన బుగ్గన... టీడీపీ ఇచ్చిన తప్పుడు నివేదికల కారణంగానే వరల్డ్ బ్యాంకు వెనకడుగు వేసిందని చెప్పారు. అమరావతి నిర్మాణంలో నిధుల కేటాయింపు, కొనసాగుతున్న పనులపై వరల్డ్ బ్యాంకు అభ్యంతరాలు లేవనెత్తిందని - అదే సమయంలో టీడీపీ హయాంలో చోటుచేసుకుంటున్న స్కామ్ లు - నిధుల దుర్వినియోగంపై వరల్డ్ బ్యాంకు భయపడిందని - ఈ కారణంగానే వరల్డ్ బ్యాంకు రుణాన్ని రద్దు చేసుకుందని చెప్పారు. నిధులు విడుదల కాకముందే... కాంట్రాక్టర్లకు మొత్తం నిధులన్నీ విడుదల చేసి కేవలం ఫీజుల రీయింబర్స్ మెంట్ నిధులను మాత్రమే పెండింగ్ పెట్టిన వైనంపై వరల్డ్ బ్యాంకు అసంతృప్తి వ్యక్తం చేసిందని తెలిపారు.

అయినా వరల్డ్ బ్యాంకు నిధులు విడుదల కాకముందే... ఆ పనుల టెండర్లన్నీ ముగించేసి పనులు ఎలా కట్టబెడతారని కూడా బుగ్గన ప్రశ్నించారు. తాజాగా తమ ప్రభుత్వం తీరుతో వరల్డ్ బ్యాంకు సంతృప్తిగానే ఉందని, అమరావతికి రూ.5 వేల కోట్ల రుణానికి కూడా ఆ బ్యాంకు సిద్ధంగా ఉందని బుగ్గన చెప్పారు. అంతేకాకుండా అమరావతి అభివృద్ధికి సంబందించి వీలయినంత మేర సాయాన్ని అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు చెప్పారని కూడా బుగ్గన చెప్పారు. ఈ విషయంపై అంతకుముందు చంద్రబాబు చేసిన వాదనను తిప్పకొడుతూ బుగ్గన చేసిన వాదనతో టీడీపీ శిబిరం నుంచి సైలెన్సే సమాధానమైందని చెప్పాలి.

Tags:    

Similar News