బాబు స్క్రిప్ట్... సోనిమా యాక్షన్...!

Update: 2018-11-25 04:35 GMT
మేడ్చల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఆనందాన్ని పూర్తిగా అనుభవించక ముందే ఆ సంతోషం పై నీళ్లు చల్లారు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు. మేడ్చల‌్ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ చేసిన ప్రసంగాన్ని రచించింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు విరుచుకుపడుతున్నారు.  తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు తన్నీర్ హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు సోనియా సభపై నిప్పులు చెరిగారు. ఈ బహిరంగ సభలో మాట్లాడిన సోనియా గాంధీ తెలంగాణలో ఎన్నికలు జరుగుతూండగా ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందని హరీష్ రావు ప్రశ్నించారు.  దీని వెనుక తెలంగాణలో ఉన్న సెటిలర్ల ఓట్ల కోసమే అని ఆయన పరోక్షంగా విమర్శించారు. ఆంధ‌్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని సోనియా గాంధీ ప్రకటించడం తెలంగాణ హక్కులను కాలరాయడమేనని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో ఎన్ని కూటమిలు వచ్చినా తెలంగాణ రాష్ట్ర సమితి విజయాన్ని అడ్డుకోలేరని మరీష్ రావు స్పష్టం చేశారు.

మరోవైపు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాలుగేళ్ల తర్వాత కూడా అమరావతిలో రాజధాని నిర్మాణం పూర్తి చేయలేకపోయిన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను అభివ్రద్ధి చేసింది తానేనని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అమరావతిలో కట్టడాలు లేవని, అన్నీ గ్రాఫిక్స్ మాయాజాలంతోనే నింపేస్తున్నారని తారక రామారావు విమర్శించారు. తెలంగాణలో మహానాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఒంటరిగా ఎదుర్కోలేక కాంగ్రెస్, తెలుగుదేశపార్టీలు ఏకం అయ్యాయని, ఈ అపవిత్ర కలయికకు సిద్ధాంతం లేదని విమర్శించారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు వీణ, రాహుల్ గాంధీ ఫిడెల్ వాయించుకోవాల్సిందేనని తారక రామారావు ఎద్దేవా చేశారు.
Tags:    

Similar News