త‌మ్ముళ్ల‌ను మోడీ ద‌గ్గ‌ర‌కు పంపుతున్న బాబు

Update: 2017-07-11 06:01 GMT
కొన్ని ప‌నులు పైస్థాయిలోనే జ‌రిగిపోవాలి. అస‌లు మాట్లాడుకున్నారా? లేదా? అన్న సందేహం క‌లిగే లోప‌లే అనుకున్న ప‌ని అనుకున్న‌ట్లుగా పూర్తి  కావాలి. అంతే కానీ.. అదే ప‌నిగా మాట్లాడుకోవ‌టం.. మీడియాలోకి రావ‌టం.. ఒత్తిడి తేవాల‌ని సూచ‌న చేయ‌టం లాంటివ‌న్నీ కాలం చెల్లిన విధానాలు. ఇంకా వాటినే అంటి పెట్టుకొని ఉంటున్న చంద్ర‌బాబు త‌న తీరును మార్చుకోక‌పోతే ఇబ్బందేన‌న్న మాట వినిపిస్తోంది.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మోడీ మీద‌ ఒత్తిడి పెట్టే ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు లేర‌న్న‌ది వాస్త‌వం. అందులో మ‌రో మాట‌కు తావు లేదు. 2019 ఎన్నిక‌ల నాటికి అసెంబ్లీ స్థానాల పెంపు లెక్క‌ను మైండ్ లో పెట్టుకొని ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మొద‌లెట్టిన చంద్ర‌బాబుకు.. కాలం గ‌డుస్తున్న కొద్దీ టెన్ష‌న్ అంత‌కంత‌కూ పెరుగుతోంది.

ఆ మ‌ధ్య వ‌ర‌కూ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపు విష‌యంలో ఇప్పుడు సాధ్యం కాద‌న్న‌ట్లుగా కేంద్రం చెప్ప‌టం బాబు అండ్ కోకు నిరాశ‌లోకి నెట్టేశాయి. రాష్ట్రప‌తి ఎన్నిక‌.. ప్ర‌త్యేక హోదాను త్యాగం చేయ‌టం ద్వారా మోడీ మ‌న‌సును కొంత‌మేర దోచుకున్న చంద్ర‌బాబు.. త‌న‌కు రాజ‌కీయంగా అత్యంత కీల‌క‌మైన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై కేంద్రం సానుకూలంగా రియాక్ట్ అయ్యేలా కొంత‌మేర చేయ‌గ‌లిగారు.

ఈ క్రెడిట్ లో బాబుతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు ఎంతోకొంత భాగం ఇవ్వాల్సిందే. బాబు మాదిరే కేసీఆర్‌ కు కూడా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్రప‌తి ఎన్నిక‌కు మోడీ అభ్య‌ర్థికి జై కొట్టేశారు తెలంగాణ సీఎం.

 ఇదే కేసీఆర్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. ఇదే మోడీని ఫాసిస్ట్ అన్న పెద్ద మాట‌ను కూడా అనేశారు. క‌రిగిపోయే కాలంలో ఇలాంటి మాట‌ల‌న్ని మ‌ర్చిపోతుంటారు. అసెంబ్లీ స్థానాల సంఖ్య‌ను పెంచుకునేందుకు ఇద్ద‌రు చంద్రుళ్లు త‌మ వంతుగా ఎంత ప‌ని చేయాలో అంత ప‌ని చేస్తున్నారు. వీరిద్ద‌రికి ఎంతో కీల‌క‌మైన సీట్ల సంఖ్య పెంపుపై త‌మ స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఎంపీల‌తో స‌మావేశ‌మైన చంద్ర‌బాబు.. ప్ర‌ధాని మోడీని.. బీజేపీ అధినేత అమిత్ షాపై అసెంబ్లీ స్థానాల పెంపు అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాల‌ని కోరారు. పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా ప్ర‌ధానిని క‌లిసి.. అసెంబ్లీ స్థానాల పెంపు అంశాన్ని ప్ర‌స్తావించాల‌ని ఎంపీల‌ను బాబు కోరితే.. తాము క‌లుస్తామ‌ని.. మ‌రోసారి మీరూ క‌ల‌వండంటూ ఎంపీల‌కు బాబు చెప్ప‌టం గ‌మ‌నార్హం.

మోడీని క‌లిసి సీట్ల సంఖ్య పెంపుపై ఒత్తిడి పెంచాల‌ని.. అమిత్ షాను క‌లిసి అవ‌స‌రాలు చెప్పాల‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. అంతా బాగానే ఉంది కానీ.. ఒత్తిడి పెంచాలంటూ బాబు చెప్పిన మాట‌ల‌న్నీ మీడియాలోకి వ‌చ్చేశాక‌.. అవి కాస్తా బ‌య‌ట‌కు వ‌చ్చి ఏపీ బీజేపీ నేత‌ల ద్వారా ఢిల్లీకి చేరితే  ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అస‌ర‌మే లేదు. ప్ర‌త్యేక ప‌రిస్థితుల్ని ప్ర‌త్యేకంగా డీల్ చేయాలే త‌ప్పించి.. ఎంపీల‌ను ప్ర‌ధాని వ‌ద్ద‌కు పంపి ఒత్తిడి తేవాల‌నుకోవ‌టం మొద‌టికే మోసం వ‌చ్చే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మ‌రోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఈ విష‌యాన్ని గుట్టుచ‌ప్పుడు కాకుండా పావులు క‌ద‌ప‌టం క‌నిపిస్తుంది. అందుకు భిన్నంగా బాబు తీరు ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. క‌దిలించుకొని మ‌రీ ఇరుకున ప‌డే  చిత్ర విచిత్ర‌మైన ఐడియాలు బాబుకు ఎవ‌రు ఇస్తారో.. ఏమో?
Tags:    

Similar News