ప‌వ‌న్‌, ఎన్టీఆర్‌ను ఎన్నిక‌ల కోసం వాడారు

Update: 2015-10-12 17:18 GMT
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడి పై తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. గ‌తంలో చంద్ర‌బాబు కోట‌రీలో కీల‌క‌మైన వ్య‌క్తిగా ఉన్న ఆయ‌న టీడీపీని వీడాక వీలు చిక్కిన ప్ర‌తిసారి చంద్ర‌బాబుతో పాటు టీడీపీ నాయ‌కుల‌ను టార్గెట్‌గా చేసుకుని ప‌దునైన పంచ్ డైలాగులు విసురుతున్నారు. సోమ‌వారం ఆయ‌న స‌చివాలయంలో విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ - ఏఎన్ఆర్ సినిమా ప‌రిశ్ర‌మ అభివృద్ధి కోసం ఎంతో క‌ష్ట‌ప‌డితే తొమ్మిది సంవ‌త్స‌రాల పాటు సీఎంగా ప‌నిచేసిన చంద్ర‌బాబు మాత్రం తెలుగు సినిమ ప‌రిశ్ర‌మను ఏనాడు ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఇండ‌స్ర్టీ కోసం ఏం చేశారో చెప్పాల‌ని త‌ల‌సాని స‌వాల్ విసిరారు.

   సినిమా రంగంలోని హీరోల‌ను చంద్ర‌బాబు త‌న వ్య‌క్తిగ‌త‌ - స్వార్ధ ప్ర‌యోజ‌నాల కోసం వాడుకున్నార‌ని త‌ల‌సాని ఫైర్ అయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ - జూనియర్ ఎన్టీఆర్ - బాలకృష్ణను ఎన్నికల కోసం వాడుకున్నార‌ని అన్నారు. అలాగే తెలంగాణ ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కుల‌పై కూడా త‌ల‌సాని మండిప‌డ్డారు. ప‌నీపాటా లేని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు పండుగ‌ల‌ను కూడా రాద్దాంతం చేస్తున్నార‌ని....ఎప్ప‌టి నుంచో మ‌న సంస్కృతిలో భాగంగా ఉంటూ వ‌స్తున్న పండుగ‌ల‌ను రాష్ర్ట ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌కూడ‌దా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

తెరాస తెలంగాణ‌లో ఎప్ప‌టి నుంచో ప‌రిష్కారం కాకుండా ఉన్న ధీర్ఘ‌కాల స‌మ‌స్య‌ల‌ను కూడా శాశ్వ‌తంగా ప‌రిష్క‌రిస్తోంద‌ని...అలాగే రైతు స‌మ‌స్య‌ల ప‌రిష్కారంతో పాటు వారికి గిట్టుబాటు ధ‌ర క‌ల్పిస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. రైతులు గిట్టుబాటు ధ‌ర వ‌చ్చే వ‌ర‌కు తాము పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు రాష్ర్ట వ్యాప్తంగా మండ‌లానికి ఒక గిడ్డంగిని నిర్మిస్తున్న‌ట్టు చెప్పారు.

 ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప‌ట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడ‌డం త‌గ‌ద‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. టీడీపీ నేతలకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోక‌పోతే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని త‌ల‌సాని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. టీవీల్లో క‌నిపిస్తామ‌ని గింత‌గింతోడు కూడా అడ్డ‌దిడ్డంగా మాట్లాడుతున్నాడ‌ని ప‌రోక్షంగా రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఆయ‌న సెటైర్లు వేశారు. టీ టీడీపీ నేత‌ల‌కు తెలంగాణ స‌మ‌స్య‌లే కనిపిస్తాయా...ప‌ట్టిసీమ ప్రాజెక్టు అక్ర‌మాలు క‌నిపించ‌వా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.
Tags:    

Similar News