త‌మ్ముళ్ల ఆశ‌కు బాబు కూడా న‌వ్వేశారు?

Update: 2018-11-01 04:39 GMT
ఏంటండి మ‌రీనూ.. చంద్ర‌బాబు న‌వ్వితే కూడా విశేష‌మేనా? అని ప్ర‌శ్నించొచ్చు. న‌వ్వ‌టం అంటే ఏమిటో తెలీక‌.. న‌వ్వు అనే ఔష‌ధం గురించి అర్థం కాకుండా బ‌తికేసే బాబుకు.. న‌వ్వుతూ ఉండాల‌ని.. కాస్త ముఖం మీద న‌వ్వు తెచ్చుకో అంటూ చుర‌క‌లేసి మ‌రీ న‌వ్వేలా చేయ‌ట‌మే కాదు.. బాబును హాయిగా న‌వ్వేసేలా మార్చిన క్రెడిట్ దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికే ద‌క్కుతుంది.

వైఎస్ వేసిన చుర‌క‌ల‌తో న‌వ్వ‌టం మొద‌లెట్టిన బాబు ఫోటోలు.. ప్ర‌ముఖంగా అచ్చేసేవి మీడియా సంస్థ‌లు. ఎప్పుడూ గంటు పెట్టుకున్న‌ట్లుగా ఉంటూ.. ఎలాంటి భావోద్వేగాన్ని క‌లిగించ‌ని ప్ర‌సంగాల‌తో బోర్ కొట్టించే బాబు.. ఎప్పుడైనా న‌వ్వితే అది విశేష‌మే. ఇదీ బాబు న‌వ్వుకున్న ప్ర‌త్యేక‌త‌.

బాబు ఊరికే న‌వ్వ‌రు. ఆయ‌న న‌వ్వించ‌టం అంత తేలిక కాదు. అలాంటిది ఏపీ మంత్రి క‌మ్ తెలుగు త‌మ్ముడు ఒక‌రన్న మాట‌కు బాబు న‌వ్వేశారు. బాబుకు సైతం న‌వ్వు తెప్పించే ఆ మంత్రి మాట వింటే మీకు సైతం న‌వ్వు రాక మాన‌దు. బాబులాంటోడే న‌వ్వ‌గా లేనిది.. ఆ మాట‌కు ప్ర‌పంచంలో ఎవ‌రైనా న‌వ్వేస్తారు. ఎందుకంటే.. ఆ మాట‌లో అంత అమాయ‌క‌త్వం.. అంత‌కు మించి త‌మ‌ను తాము ఊహించుకునే తీరు చూస్తే.. ఔరా అనిపించ‌క మాన‌దు. ఇంత‌కీ బాబు ఎందుకు న‌వ్వారు?  ఆయ‌న న‌వ్వేలా చేసి మంత్రి మాట వింటే అవాక్కు కాక మాన‌దు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బాబుకు కాంగ్రెస్‌తో క‌ల‌వ‌టం మిన‌హా మ‌రో గ‌త్యంత‌రం లేదు. తాను చేసిన త‌ప్పులు కేసుల రూపంలో వెంటాడే ప‌రిస్థితిని గుర్తించిన బాబు బీజేపీతో త‌న‌కున్న శ‌త్రుత్వాన్ని మ‌రింత పెద్ద‌ది చేసేందుకు వీలుగా మోడీపై విరుచుకుప‌డ‌టం మొద‌లెట్టారు. అక్క‌డితో ఆగ‌కుండా రాజ‌కీయంగా అంతో ఇంతో ప్ర‌యోజ‌నం పొందాల‌న్న ఉద్దేశంతో కాంగ్రెస్‌ తో క‌లిసే ప్ర‌య‌త్నాలు తెర వెనుక చేప‌ట్టారు.

అందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో క‌లిసి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించారు. కూట‌మిగా ఏర్ప‌డిన‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కూ కాంగ్రెస్ తో చంద్ర‌బాబు క‌లిసింది లేదు. అన‌ధికారికంగా భేటీలు జ‌రిగినా.. కాంగ్రెస్ తో అధికారికంగా బాబు ఇప్ప‌టివ‌ర‌కూ క‌లిసింది లేదు. తాజాగా కాంగ్రెస్‌ తో ఎంత త్వ‌ర‌గా క‌లిస్తే అంత మంచిద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న బాబు.. ఆ దిశ‌గా అడుగులు వేయ‌టం షురూ చేశారు.

ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న మంత్రుల‌ను అర్జెంట్ గా పిలిచిన ఆయ‌న  రాహుల్ తో తాను భేటీ కానున్నాన‌ని.. అందుకు క‌లిగే లాభ‌న‌ష్టాల మీద చ‌ర్చ (బాబు డిసైడ్ అయినా.. ఇలా అంద‌రితో సంప్ర‌దింపులు జ‌రిపాకే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా క‌ల‌ర్ ఇచ్చే డ్రామాలు ఆయ‌న‌కో అల‌వాటు) జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఒక‌రు చేసిన వ్యాఖ్య అంద‌రి దృష్టిని ఆక‌ర్సించింది.

కాంగ్రెస్‌ తో క‌లిసి ప‌ని చేయాల్సిన అనివార్య‌త గురించి చెప్పిన బాబు మాట‌ల‌కు మంత్రులు సైతం ఓకే అంటూ వంత పాడేశారు. కాంగ్రెస్ వ్య‌తిరేక‌తే పార్టీ మూల‌మ‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేసిన‌ బాబు.. త‌నకున్న కేసుల చిక్కుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు మోడీ వ్య‌తిరేక రాగాన్ని ఆల‌పిస్తూ కాంగ్రెస్‌ తో  జ‌త క‌ట్ట‌టానికి బాబు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. రాహుల్ తో భేటీ కావ‌టంపై పెద్ద‌గా అభ్యంత‌రాలు చేయ‌ని ఏపీ మంత్రుల‌కు భిన్నంగా ఒక మంత్రి త‌న మ‌న‌సులోని సందేహాన్ని బ‌య‌ట‌పెట్టారు. వ‌య‌సులో చిన్న‌వాడైన రాహుల్ తానే చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వ‌చ్చి క‌లిస్తే బాగుంటుందేమోన‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఆ మంత్రి మాట‌కు బాబు ఒక్క‌సారి న‌వ్వేశారు. చిన్న పార్టీల వ‌ద్ద‌కు తానే వెళ్లి స్వ‌యంగా మాట్లాడుతున్న విష‌యాన్ని గుర్తు చేస్తూ.. వాటితో పోలిస్తే కాంగ్రెస్ పెద్ద పార్టీ అని.. వెళ్లి మాట్లాడితే వారి మ‌న‌సులో భావాలు తెలుస్తాయని చెప్పారు. ఇవాళ బాబు ఉన్న ప‌రిస్థితికి ఆయ‌న‌కు ఆయ‌న వెళ్ల‌ట‌మే కాదు.. ఎవ‌రో వ‌చ్చి మాట్లాడే ప‌రిస్థితి లేద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. బాబు మ‌న‌సును దోచుకోవ‌టానికి మంత్రి చేసిన వ్యాఖ్య‌లు చూసిన‌ప్పుడు త‌మ బ‌లాన్ని ఎక్కువ‌గా ఊహించుకోవ‌టం ఒక ఎత్తు అయితే.. మంత్రి హోదాలో ఉన్న నేత మ‌రీ ఇంత అమాయ‌క‌త్వంతో మాట్లాడ‌ట‌మా? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు.


Tags:    

Similar News